story
Home » World Cup- కపిల్‌దేవ్ ఉదారంతో ఓటమి..ధోనీ నిర్ణయంతో టాస్ రెండు సార్లు

World Cup- కపిల్‌దేవ్ ఉదారంతో ఓటమి..ధోనీ నిర్ణయంతో టాస్ రెండు సార్లు

by admin
0 comment

క్రికెట్ వన్డే వరల్డ్‌ కప్‌ ప్రారంభమైంది. 46 రోజులు పాటు సాగే ఈ మెగా సమరంలో విజేతగా నిలబడటానికి పది జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటివరకు 12 సార్లు టోర్నీ నిర్వహించగా ఆస్ట్రేలియా అయిదు సార్లు, భారత్ రెండు సార్లు, వెస్టిండీస్‌ రెండు సార్లు, పాకిస్థాన్‌, శ్రీలంక, ఇంగ్లాండ్‌ ఒక్కసారి విశ్వవిజేతగా నిలిచాయి. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు జరిగాయి. కపిల్‌దేవ్ ఉదారంతో మన జట్టు ఒక్క పరుగుతో ఓటమిపాలైంది. ధోనీ నిర్ణయంతో ఫైనల్లో రెండు సార్లు టాస్‌ వేశారు. ప్రపంచకప్‌ చరిత్రలో జరిగిన ఇలాంటి విశేషాల గురించి ఓ లుక్ వేద్దాం!!

  • తొలి ప్రపంచకప్ 1975 జూన్‌లో ఇంగ్లాండ్‌ వేదికగా జరిగింది. దానికి రెండేళ్ల ముందుగానే 1973లో మహిళల ప్రపంచకప్‌ జరగడం విశేషం. ఇక ఆతిథ్యం ఇవ్వడంలో ఇంగ్లాండ్‌కో రికార్డు ఉంది. నాలుగుసార్లు మెగా ఈవెంట్‌ను నిర్వహించింది. ఆ తర్వాత ఉపఖండంలోనే ఎక్కువగా మెగాటోర్నీ నిర్వహించారు. గతంలో భారత్‌ ఇతర దేశాలతో కలిసి సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఈ సారి మాత్రం అన్ని మ్యాచ్‌లు ఇండియాలోనే జరగనున్నాయి.
  • ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఎంతో మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. అయితే మెగాటోర్నీ ఆడిన అతి పెద్ద వయస్కుడిగా నోలన్‌ క్లార్కీ పేరిట రికార్డు ఉంది. 1996 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌ తరఫున ఆడిన క్లార్కీకి అప్పుడు 47 ఏళ్లు. ఇక ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అతిపిన్న వయస్సు ఆటగాడు అఫ్గానిస్థాన్ యువ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్. టోర్నీ ఆరంభమైన సమయానికి అతడి వయస్సు 18 ఏళ్ల 275 రోజులు. ఇక అతి పెద్ద ఆటగాడిగా నెదర్లాండ్స్‌ ఆటగాడు వెస్లీ బరిలోకి దిగుతున్నాడు. అతడి వయస్సు 39 ఏళ్ల 155 రోజులు.
  • ఐసీసీ వరల్డ్‌కప్‌ను ముద్దాడటానికి ప్రతిదేశం హోరాహొరీగా పోరాడుతుంటుంది. మరి ఇంతకీ ఆ వరల్డ్‌కప్‌ ఎత్తు ఎంతంటే 2 అడుగులు. దీన్ని బంగారం, వెండితో తయారుచేశారు. పైభాగంలో గ్లోబ్‌ ఉంటుంది.
  • ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడకుండానే ప్రపంచకప్‌ నెగ్గిన ఆటగాడిగా సునీల్‌ వాల్సన్ చరిత్రకెక్కాడు. 1983 ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టులో సునీల్ సభ్యుడే అయినా ఒక్క మ్యాచ్‌లో కూడా తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.
  • 1987 ప్రపంచకప్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. డీన్‌ జోన్స్‌ కొట్టిన బంతి ఫోరా, సిక్సరా అనేది అర్థం కాలేదు. బౌండరీ లైన్‌ ఫీల్డర్‌ రవిశాస్త్రి ఫోర్ అంటే.. బ్యాటర్‌ జోన్స్‌ మాత్రం సిక్సర్‌ అని వాదనలు చేశాడు. అంపైర్లతో మాట్లాడిన కెప్టెన్ కపిల్ దేవ్‌.. దాన్ని సిక్సర్‌గా ఇచ్చేయండంటూ ఉదారంగా వ్యవహరించాడు. చివరికి భారత్ ఆ మ్యాచ్‌లో ఒక్క పరుగుతో ఓడింది. అది ఫోర్‌ అయితే ఇండియా గెల్చివుండేది.
  • శ్రీలంక బ్యాటర్‌ మార్వన్‌ ఆటపట్టుది మరో ఆసక్తికర అంశం. రెండు సార్లు ప్రపంచకప్‌ ఫైనల్స్‌ జట్టులో ఉన్నా అతడు తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 1996లో ఆస్ట్రేలియాను ఓడించి శ్రీలంక విజేతగా నిల్చింది. అలాగే 2007లో అదే ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఈ రెండు సార్లు జట్టులో ఆటపట్టు సభ్యుడే అయినా తుదిజట్టులో అవకాశం రాలేదు.
  • మెగా టోర్నీలో ఇప్పటివరకు ఎంతోమంది హ్యాట్రిక్‌ వికెట్లు తీశారు. అయితే తొలిసారిగా ఈ ఘనత సాధించిన బౌలర్‌గా చేతన్‌ శర్మ రికార్డులకెక్కాడు. 1983లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించిన చేతన్‌ ఈ రికార్డు సాధించాడు.
  • రెండు సార్లు ప్రపంచకప్‌ గెలిచిన కెప్టెన్లుగా క్లయివ్‌ లాయిడ్‌, రికీ పాంటింగ్‌ నిలిచారు. 1975, 1979లో వెస్టిండీస్‌ను లాయిడ్ కప్‌ గెలిపించగా, 2003, 2007లో ఆసీస్‌ను పాంటింగ్‌ విజేతగా నిలిపాడు.
  • ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు 433 పరుగులు. 2007లో బెర్ముడాపై భారత్‌ ఈ రికార్డు చేసింది. కాగా, 2003లో శ్రీలంకపై కెనడా చేసిన 36 పరుగులు అత్యల్పం.
  • వన్డే చరిత్రలో రెండు దేశాలకు ప్రాతినిథ్యం వహించిన తొలి ఆటగాడు కెప్లర్ వెస్సల్స్. 1982-85 మధ్య ఆస్ట్రేలియా తరఫున ఆడిన కెప్లర్ 1991 నుంచి దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించాడు. వివాదాస్పద రీతిలో 1992 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా జట్టు పగ్గాలను అందుకున్నాడు.
  • 2011 ప్రపంచకప్‌ భారత్-శ్రీలంక ఫైనల్లో టాస్‌ను రెండు సార్లు వేయాల్సి వచ్చింది. తొలిసారి టాస్‌ వేసినప్పుడు శ్రీలంక కెప్టెన్‌ సంగక్కర ఏమన్నాడో మ్యాచ్‌ రెఫరీ జెఫ్ క్రో సరిగా వినలేదు. కాయిన్‌ కింద పడిన తర్వాత హెడ్స్‌ కావడంతో తాము బ్యాటింగ్‌ ఎంచుకొంటున్నట్టు సంగక్కర చెప్పాడు. కానీ ధోనీ మాత్రం సంగక్కర టెయిల్స్‌ అన్నట్టు తెలిపాడు. దీంతో మరోసారి టాస్‌ వేయాల్సి వచ్చింది. అయితే రెండో సారి కూడా లంకే టాస్ గెలిచింది.
  • ఈ మెగాటోర్నీకి వెస్టిండీస్ అర్హత సాధించలేకపోయింది. చరిత్రలో తొలిసారిగా విండీస్‌ జట్టు లేకుండా వన్డే ప్రపంచకప్‌ జరుగుతుంది.
  • ఈసారి ఛాంపియన్‌గా ఎవరు నిలుస్తారో విశ్లేషకులు ఇప్పటికే చర్చలు మొదలుపెట్టారు. మరి విజేతకు ఎంత ప్రైజ్‌మనీ తెలుసా? ట్రోఫీ గెలిచే జట్టుకు ఏకంగా రూ. 33 కోట్ల 18 లక్షలు అందుకుంటుంది. రన్నరప్‌కు రూ.16 కోట్ల 59 లక్షలు ఇస్తారు. సెమీస్‌లో ఓడిన రెండు జట్లు చెరో రూ. 6 కోట్ల 63 లక్షలు పొందుతారు. గ్రూప్‌ దశలోనే ఇంటిదారే పట్టే జట్లకు సుమారు తలో 83 లక్షలు ఇస్తారు. ఇవేకాకుండా గ్రూప్‌ మ్యాచ్‌ల్లో ఒక్కో విజయానికి దాదాపు 33 లక్షలు అందిస్తారు.
  • ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా పేసర్‌ మెక్‌గ్రాత్‌ 71 వికెట్లు తీశాడు. టోర్నీ చరిత్రలో అత్యధిక వికెట్ల రికార్డు అతడిదే.
  • ప్రపంచకప్‌ చరిత్రలోనే టాప్‌స్కోరర్‌గా సచిన్ నిలిచాడు. అతడు మెగాటోర్నీలో 2,278 పరుగులు చేశాడు.
  • ప్రపంచకప్‌ల్లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్లుగా సచిన్‌, రోహిత్‌ శర్మ ఉన్నారు. వీరిద్దరు 6 సెంచరీలు చేశారు. రోహిత్‌ 2019 ప్రపంచకప్‌లోనే అయిదు శతకాలు బాదడం విశేషం. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీల రికార్డు హిట్‌మ్యాన్ పేరిట ఉంది. ప్రస్తుతం జరుగుతున్న మెగా సమరంలో రోహిత్ సెంచరీ సాధిస్తే సచిన్‌ను అధిగమించి చరిత్రకెక్కుతాడు.
  • వెస్టిండీస్‌ను ఓడించి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్‌ జట్టులో మన తెలుగువాడు తేజ నిడమానూరు ఉన్నాడు. అతడు విజయవాడలో పుట్టి న్యూజిలాండ్‌లో పెరిగి పెద్దవాడై.. ఇప్పుడు నెదర్లాండ్స్‌ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links