357
నిండు మనసుతో తన అన్నకి విజయ తిలకం దిద్ది, కుడి చేతికి రక్ష కట్టి, మంగళహారతినిచ్చి, మధుర పదార్థాన్ని తినిపించాలనుకున్న ఓ సోదరికి గుండెపగిలే విషాదం ఎదురైంది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న తన సోదరుడు గుండెపోటుతో ఒక్కసారిగా విగతజీవిగా మారాడు. గుండెలవిసేలా రోదిస్తూ మృతిచెందిన అన్న మృతదేహానికి ఆమె రాఖీ కట్టారు. ఈ హృదయ విదారక ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని దూళికట్టలో చోటుచేసుకుంది. చౌదరి కనకయ్య అనే వ్యక్తి గుండెపోటుతో ఇవాళ హఠాన్మరణం చెందాడు. దీంతో అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చిన అతడి సోదరి గౌరమ్మ పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. తీవ్ర దుఃఖంతోనే కనకయ్య మృతదేహానికి ఆమె రాఖీ కట్టారు. సోదరి అనురాగాన్ని చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.