IND vs PAK
Home » INDvsPAK తాతల తరాల నుంచి మనదే గెలుపు.. పాక్‌ టీవీలు పగిలిపోవాల్సిందే!!

INDvsPAK తాతల తరాల నుంచి మనదే గెలుపు.. పాక్‌ టీవీలు పగిలిపోవాల్సిందే!!

by admin
0 comment

వన్డే ప్రపంచకప్‌ ప్రారంభమై వారం రోజులు దాటింది. కానీ క్రికెట్‌ లవర్స్‌కు ఇంకా ‘కప్‌ కిక్కు’ ఎక్కట్లేదు. హోరాహోరీగా మ్యాచ్‌లు సాగుతుంటాయనకుంటే వన్‌సైడ్‌ అవుతూ చప్పగా సాగుతున్నాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌- రన్నరప్‌ ప్రారంభ మ్యాచ్‌ నుంచే ఇదే రిపీట్ అవుతుంది. ఊపిరి బిగపట్టే, నరాలు తెంచుకునే ఉత్కంఠ పోరు.. ఒక్కటి కూడా లేదు. అయితే క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఫుల్‌ మీల్స్‌ రెడీ అయ్యాయి. ప్రపంచమంతా ఎంతగానో ఎదురుచూస్తున్న దాయాదీల పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లో శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ‘హై వోల్టేజ్‌ క్రికెట్ యుద్ధం’ ప్రారంభం కానుంది. ఈ మినీవార్‌లో రోహిత్‌ సేన- బాబర్‌ అజామ్‌ జట్టు తలపడనున్నాయి. మరి, హిస్టరీని రిపీట్ చేస్తూ టీమిండియా మరోసారి పాక్‌ను చిత్తు చేస్తుందా? ప్రపంచ సమరంలో ఆధిపత్యం చెలాయిస్తూ 8-0 రికార్డును లోడ్‌ చేస్తుందా?

దేశ విభజన తర్వాత భారత్, పాక్‌ల మధ్య సరిహద్దుల్లోనే కాదు, క్రీడా మైదానాల్లోనూ ఉద్రిక్తతలే. అది క్రికెటైనా, హాకీయైనా, కబడ్డీ అయినా!! ఇక ఇండియా-పాక్ మధ్య క్రికెట్‌ మ్యాచంటే రెండు దేశాల అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహం, ఉత్సుకత కనిపిస్తుంది. ప్రపంచమంతా ఈ ఫైట్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటుంది. ఆ రేంజ్‌లో ఇరు జట్ల మధ్య ఫైట్ ఉంటుంది. తల అయినా తెంచుకుంటాం కానీ ఓటమిని ఒప్పుకోమనే రీతిలో.. ఆటలో ఉద్రిక్తత, భావోద్వేగం కనిపిస్తుంటుంది. అయితే తాతల తరాల నుంచి పాక్‌ మనపై ఫైట్‌ చేస్తున్నా.. ఎప్పుడూ మనదే పైచేయి. మెగాటోర్నీలో పాకిస్థాన్‌ ఇండియాపై ఒక్కసారిగా కూడా గెలవలేకపోయింది. ఇప్పటివరకు వన్డే వరల్డ్ కప్‌లో ఏడు సార్లు మ్యాచ్‌లు జరిగితే అన్నింట్లోనే మన జెండానే ఎగిరింది. ఈ టోర్నీలోనూ అదే రిపీట్ చేస్తూ 8-0 రికార్డు బద్దలు కొట్టాలని రోహిత్‌సేన కసిగా ఉంది.

ఈ మెగాటోర్నీలో భీకర ఆస్ట్రేలియాను, పసికూన అఫ్గానిస్థాన్‌ ను రోహిత్‌సేన సునాయాసంగా మట్టికరిపించింది. మెగాటోర్నీ ప్రారంభానికి ముందు మన జట్టుపై విమర్శకులకు ఉన్న సందేహాలను పటాపంచలు చేస్తూ టీమిండియా గెలుపుదారిలో పయనిస్తోంది. హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్‌ అంచనాలకు తగ్గట్టుగానే ప్రదర్శన చేస్తోంది. మరోవైపు పాకిస్థాన్‌.. నెదర్లాండ్స్‌పై గెలుపు, శ్రీలంకపై రికార్డు విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. బలబలాల్లో సమవుజ్జీలుగా ఉన్న ఇరు జట్లు నాలుగు పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే ఇటీవల ఆసియా కప్‌లో ఇరు జట్లు తలపడగా, పాక్‌పై కనికరం లేకుండా భారత్‌ చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌ను గుర్తు చేసుకోవాలంటే పాక్‌ వణికిపోయేలా బెదరగొట్టింది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వీరశతకాలకు తోడుగా, కుల్‌దీప్‌ అయిదు వికెట్లు తీయడంతో… 228 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది.

అయితే ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను అంత తేలిగ్గా తీసుకోవడానికి వీళ్లేదు. ఎప్పుడూ తమ కెప్టెన్ బాబర్ అజామ్‌పై ఆధారపడే ఆ జట్టు.. ఇప్పుడు అతడు విఫలమవుతున్నా గొప్ప ప్రదర్శన చేస్తుంది. ఇక ఆ జట్టుకు మహ్మద్‌ రిజ్వాన్‌ ప్రధాన ఆయుధంగా మారాడు. సూపర్‌ఫామ్‌లో ఉన్న అతడు వరుసగా 68, 131 పరుగులతో జట్టుకు విజయాల్ని అందించాడు. అతడితో పాటు ‘అబ్దుల్లా షఫీకి’, ‘సౌద్ షకీల్‌’ ఫామ్‌లో ఉండటం వారికి సానుకూలాంశం. శ్రీలంకపై 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్‌కప్‌లో రికార్డు సృష్టించడం వారిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే.. షాహీన్‌ అఫ్రిదీ, హారీష్‌ రవూఫ్‌, హసన్ అలీతో బలంగా ఉంది. వికెట్ల వేటలో వారు సిద్ధహస్తులు. వారిలో ఇద్దరు లయ తప్పిన మరొకరు జట్టును కాపాడుకుంటూ వస్తున్నారు.

అయితే పాక్‌కు ప్రధాన సమస్య ఫీల్డింగ్‌. వీళ్ల ఫీల్డింగ్ మీమర్స్‌కు మంచి స్టఫ్‌గా ఉపయోగపడుతుంటుంది. బంతి గాల్లో ఉంటే ఇద్దరు ఆటగాళ్లు పోటాపోటీగా దగ్గరకు రావడం.. చివరి క్షణంలో నువ్వే క్యాచ్ పట్టూ అంటూ.. ఇద్దరూ డ్రాప్‌ చెయ్యడం వారికే సాధ్యం. ఫీల్డింగ్‌ కాకుండా ఒత్తిడికి చిత్తవ్వడం కూడా వాళ్లకే చెల్లుతుంది. అయితే ఒక్కసారైనా మన జట్టుపై గెలవాలనే తీరని ఆశతో.. ఈ సారి తీవ్రమైన పోటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

ప్రత్యర్థి జట్టు ఎంత బలంగా ఉన్నా పాకిస్థాన్‌తో పోరు అంటే మన ఆటగాళ్లలో ఎనర్జీ డబుల్-ట్రిపుల్‌ అవుతుంటుంది. ఇక విరాట్ కోహ్లి పాక్‌పై పగతో రగులుతున్నట్లుగా ఆడుతుంటాడు. ఒత్తిడిని చిత్తు చేస్తూ అసాధ్యమైన ఆట తీరుతో జట్టుకు వెన్నెముకగా నిలుస్తుంటాడు. ఇక విరాట్‌కు తోడుగా రోహిత్‌ శర్మ క్రీజులో ఉంటే అగ్నికి వాయువు తోడైనట్లే. వారిద్దరు ఎంత ప్రమాదకరమైన ఆటగాళ్లో దశాబ్దం క్రితమే ప్రపంచానికి చాటి చెప్పారు. అలాంటి వీరిద్దరికి ఇదే ఆఖరి వన్డే ప్రపంచకప్‌ కావడంతో.. అనుభవమంతా రంగరించి ప్రతి బంతిని ఎదుర్కొంటున్నారు. ఆసీస్‌ మ్యాచ్‌లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కోహ్లి ఎంతో నేర్పుగా ఆదుకున్నాడు. కేఎల్ రాహుల్‌కు సూచనలిస్తూ స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. అఫ్గాన్‌ మ్యాచ్‌లోనూ అజేయ అర్ధశతకం సాధించాడు. మరోవైపు హిట్‌మ్యాన్ అఫ్గాన్‌ మ్యాచ్‌లో విధ్వంసమే సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా, ప్రపంచ సిక్సర్ల వీరుడిగా రికార్డులు సృష్టించాడు. అఫ్గాన్‌పై 131 పరుగులు బాది ఔటైనా.. పరుగుల దాహం తీరనట్లుగా బాధగా మైదానాన్ని వీడాడు.

మరోవైపు యంగ్ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ డెంగీ నుంచి కోలుకోవడం టీమిండియాకు గుడ్‌ న్యూస్‌. అయితే అతడు పాక్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో లేదో అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అతడికి అహ్మదాబాద్‌ పిచ్‌పై మంచి రికార్డు ఉంది. గిల్‌ తుదిజట్టులో ఉంటే జట్టుకు మరింత బలం చేకూరుతుంది. ఇక గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చిన సీనియర్లు కేఎల్ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌.. ఈ మెగాటోర్నీలో ప్రూవ్‌ చేసుకున్నారు. క్లాస్‌ బ్యాటింగ్‌తో రాణిస్తున్నారు. ఆసీస్‌పై రాహుల్‌ 97 పరుగులు, అఫ్గాన్‌పై శ్రేయస్‌ క్లాస్‌ హిట్టింగ్‌తో తామెంత స్పెషలో చెప్పేశారు. వారికి తోడుగా హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజాతో లోతైన బ్యాటింగ్‌ భారత్‌ సొంతం. అయితే వారి నుంచి మరింత దూకుడైన బ్యాటింగ్‌ను అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక బౌలింగ్ విషయానికొస్తే బుమ్రా, సిరాజ్ పేస్‌ దళాన్ని ముందుండి నడిపిస్తున్నారు. వారికి హార్దిక్, శార్దూల్‌ అండగా నిలుస్తున్నారు. శార్దూల్ బ్యాటుతో కూడా రాణించే ప్రతిభ ఉండటంతో అఫ్గాన్‌ మ్యాచ్‌ లో అతడికి అవకాశం వచ్చింది. మరోవైపు షమికి ఇప్పటివరకు ఈ మెగాటోర్నీలో అవకాశం ఇవ్వలేదు. అతడు తుదిజట్టులోకి వస్తే ప్రత్యర్థులకు మరింత సవాలే. అతడి పేస్‌, స్వింగ్‌ బ్యాటర్లకు బెదురే. మరోవైపు స్పిన్‌ విభాగంలో టీమిండియా ఎంతో పటిష్టంగా ఉంది. కుల్‌దీప్‌ యాదవ్‌ సూపర్‌ ఫామ్‌, జడేజా పొదుపైన బౌలింగ్, అశ్విన్‌ మాయాజలంతో.. ప్రపంచంలోనే స్ట్రాంగ్‌ స్పిన్‌ జట్టుగా ఇండియా ఉంది. ఇక స్పిన్‌కు బాగా అనుకూలించే అహ్మదాబాద్‌లో మన స్పిన్నర్లను పాక్‌ ఎదుర్కోవడం చాలా కష్టం. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్‌ సాధారణ విజయంతో సరిపెట్టుకోవద్దని… మరో నాలుగేళ్లు పాకిస్థాన్‌ గుర్తుపెట్టుకునేలా.. మనం దిగ్విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరోసారి పాక్‌ టీవీలు పగిలిపోయేలా మన ప్రదర్శన ఉండాలని కోరుకుంటున్నారు.

మరోవైపు ఈ మహా సంగ్రామానికి బీసీసీఐ అదిరేలా ఏర్పాట్లు చేస్తుంది. ఆరంభ వేడుకలు లేకుండానే ప్రపంచకప్‌ మొదలుపెట్టిన బీసీసీఐ భారత్‌- పాక్‌ పోరుకు మాత్రం స్పెషల్ ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి అమిత్‌ షా, సచిన్‌ తెందుల్కర్‌, అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌ అతిథులుగా రానున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ గాయకుడు అర్జిత్‌ సింగ్‌ ప్రదర్శన ఉండబోతుంది. ఈ భారత్-పాక్‌ హై వోల్టేజ్‌ మ్యాచ్‌కు ముందు ఈ వేడుకులు ప్రేక్షకులకు బోనస్‌లా ఉండనున్నాయి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links