ఇండోర్ లో 17 ఏళ్ల అమ్మాయి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. పోలీసుల్ని పరుగులు పెట్టించింది. కట్ చేస్తే, అది కిడ్నాప్ కాదు. స్వయంగా ఆ అమ్మాయి ఆడిన నాటకం.
ఇండోర్ కు చెందిన 17 ఏళ్ల అమ్మాయి, బీఏ ఫస్టియర్ పరీక్షల్లో ఫెయిలైంది. తెలిస్తే అమ్మా-నాన్న తిడతారని తెలుసు. అందుకే సింపతీ కోసం కిడ్నాప్ డ్రామా ఆడింది. తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఫోన్ చేసి కట్ చేసింది. దీంతో యువతి తండ్రి హడావుడిగా పోలీస్ స్టేషన్ కు పరుగెత్తాడు.
ఫోన్ కట్ చేసి అమ్మాయి, తాపీగా ఓ ఆటో ఎక్కింది. బస్టాండ్ లో దిగింది. అక్కడ్నుంచి ఉజ్జయిని వెళ్లింది, అక్కడో రెస్టారెంట్ లో భోజనం కూడా చేసింది. సాయంత్రానికి మెల్లగా తిరిగొచ్చింది. పోలీసులకు మాత్రం సినిమా చూపించే ప్రయత్నం చేసింది.
తనను ఎవరో కిడ్నాప్ చేశారని, నోటిలో గుడ్డలు కుక్కారని, కళ్లకు గంతలు కట్టి ఎక్కడికో తీసుకెళ్లారని లేని ఏడుపు నటించింది. పోలీసులకు ఎందుకు అనుమానం వచ్చింది. సీసీటీవీ ఫూటేజ్ గమనిస్తే, అసలు విషయం తెలిసొచ్చింది. ఆ తర్వాత అమ్మాయి బ్యాగ్ లో బస్సు టికెట్, రెస్టారెంట్ బిల్లు కూడా దొరికింది.
దీంతో యువతికి పోలీసులు క్లాస్ పీకారు. ఆ తర్వాత ఆమెతో పాటు, ఆమె తల్లిదండ్రుల్ని కూడా కౌన్సిలింగ్ సెంటర్ కు పంపించారు.