cm jagan
Home » సీఎం జగన్ భయపడేనా?

సీఎం జగన్ భయపడేనా?

by admin
0 comment

మరో అయిదు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా రాష్ట్రంలో ఏం జరుగుతోంది? నాలుగున్నరేళ్ళుగా చడీచప్పుడు చేయకుండా ఉన్న నేతలు ఎందుకు జూలు విదిలిస్తున్నారు? సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకొని పావులు కదపడం వెనుక కథ ఏంటి? సుప్రీం కోర్టు నుంచి హైకోర్టుల వరకు దాఖలవుతున్న పిటిషన్ల వెనుక ఉన్నదెవరు? ఇస్తున్న సంకేతాలేంటి? గేమ్ ప్లాన్ ఐదు నెలల ముందే మొదలైందా? ఒకరి తరువాత ఒకరు వరుసగా జగన్ అండ్ టీమ్‌ కు వ్యతిరేకంగా న్యాయస్థానాలలో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో కాపునేత, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిల్ వేశారు. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని జోగయ్య న్యాయస్థానాన్ని కోరారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టుని అభ్యర్ధించారు.

మరోవైపు ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామ కృష్ణం రాజు పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా ధనాన్ని సొంత వ్యక్తులకు సీఎం జగన్ లబ్ది చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరపాలని 1300 పేజీలతో కూడిన పిటిషన్ ను రఘురామ కృష్ణం రాజు వేశారు. అయితే ఈ పిటిషన్ పై తాను విచారించలేనని జస్టిస్ రఘునందన రావు తెలిపారు. గతంలో కొందరు ప్రతివాదుల తరపున కేసులను వాదించిన కారణంగా ఈ కేసును విచారించలేనని జస్టిస్ రఘునందనరావు పేర్కొన్నారు. వేరే బెంచ్ కి బదిలీ చేయాలని సిజే ను జస్టిస్ రఘునందన్ రావు కోరారు. కాగా, సీఎం జగన్ ఆస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలని కూడా రఘురామరాజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విపరీతమైన జాప్యం జరుగుతోందని.. 3071 సార్లు జగన్ కేసును సీబీఐ కోర్టు వాయిదా వేసినట్లు పిటిషన్‌లో ప్రధానంగా ప్రస్తావించారు. జగన్ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందని.. వందల కొద్ది డిశ్చార్జి పిటిషన్లు వేసినట్లు పేర్కొన్నారు.

వైఎస్ జగన్‌పై సీబీఐ నమోదు చేసిన కేసులు ఇప్పటివరకు అనేక సార్లు వాయిదా పడ్డాయని పిటిషన్‌లో తెలిపారు. వీటి విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించడం లేదన్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్‌కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారని ప్రస్తావించారు.ఈ పరిస్థితులను గమనిస్తే కేసుల విచారణ ప్రారంభమయ్యే అవకాశం కనిపించడంలేదని పిటిషన్‌లో కోర్టుకు వివరించారు. సుప్రీం కోర్టు వెంటనే జోక్యం చేసుకుని.. ఈకేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ కృష్ణంరాజు పిటిషన్‌లో కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం వరుసకేసులు పెడుతుంటే మరోవైపు జగన్ అపోనెంట్స్ ఆయనపై న్యాయస్థానాలలో పిటిషన్ల పర్వం కొనసాగిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబుపై వైసీపీ సర్కార్ కేసులకు చెక్ పెట్టేందుకే జగన్ పై న్యాయస్థానాలలో పిటిషన్లను దాఖలు చేస్తున్నారన్న గుసగుసలు లేకపోలేదు. మరి న్యాయస్థానాలలో దాఖలు చేసిన పిటిషన్లతో సీఎం జగన్ ఇబ్బందులు పడనున్నారో వేచి చూడాల్సిందే!

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links