cricket
Home » Worldcup 2023 – మెగా సమరంలో భారత్‌ పోరాడిందిలా..!

Worldcup 2023 – మెగా సమరంలో భారత్‌ పోరాడిందిలా..!

by admin
0 comment

నాలుగేళ్లుగా క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్న ప్రపంచకప్‌ సమరం వచ్చేసింది. అక్టోబర్‌ 5వ తేదీన ఇంగ్లాండ్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో మెగాటోర్నీ ప్రారంభం కానుంది. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత రెండు టీ20 ప్రపంచకప్‌లు, రెండు టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ జరిగాయి. కానీ వన్డే ప్రపంచకప్‌ ఉండే క్రేజే వేరు. ప్రపంచ సమరం ఈ ఫార్మాట్‌తో ఆరంభమైందనే సెంటిమెంటో లేక ఇతర కారణాలో తెలియదు. వన్డే ప్రపంచకప్‌ విజేతగా నిలవాలని దేశాలన్ని మినీ యుద్ధంలా పోరాడుతుంటాయి. అయితే ఈ మెగాసమరంలో భారత్‌ ప్రయాణం ఎలా ఉందో ఓ లుక్‌ వేద్దాం..

తొలి ప్రపంచకప్‌ ఇంగ్లాండ్‌ వేదికగా 1975లో జరిగింది. శ్రీనివాస్‌ వెంకటరాఘవన్‌ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా గ్రూప్‌ స్టేజ్‌లోనే వెనుదిరిగింది. మూడు మ్యాచ్‌లు ఆడగా ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ వేదికగానే 1979లో నిర్వహించారు. అప్పుడు కూడా గ్రూప్‌ స్టేజ్‌లోనే నాకౌటయ్యారు. శ్రీనివాస్‌ వెంకటరాఘవన్‌ సారథ్యంలో భారత జట్టు మూడు మ్యాచ్‌లు ఆడి అన్నింట్లోనే ఓడింది.

1983లో మరోసారి ఇంగ్లాండ్‌ ఆతిథ్యం ఇచ్చింది. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్‌దేవ్‌ సేన ఈసారి ఛాంపియన్‌గా నిలిచింది. బలమైన ప్రత్యర్థి జట్లను మట్టికరిపించింది. 1987లో భారత్-పాకిస్థాన్‌ సంయుక్తంగా ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చాయి. ఫేవరేట్‌గా బరిలోకి దిగిన కపిల్‌దేవ్‌ సేన సెమీఫైనల్లో ఓటమిపాలైంది. 1992లో రౌండ్‌రాబిన్‌ పద్ధతిలో నిర్వహించిన వరల్డ్‌కప్‌లో భారత్‌ గ్రూప్‌స్టేజ్‌లోనే వెనుదిరిగింది. ఇక 1996లో భారత్‌-పాకిస్థాన్‌-శ్రీలంక ఆతిథ్యం ఇవ్వగా టీమిండియా సెమీఫైనల్‌ వరకు చేరింది. అజారుద్దీన్‌ జట్టును నడిపించాడు. ఈ సారి మరో మూడేళ్ల తర్వాత 1999లో నిర్వహించిన మెగాటోర్నీలో టీమిండియా మరోసారి నిరాశపరిచింది. సూపర్‌సిక్స్‌కు మాత్రమే అర్హత సాధించింది.

2003లో జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌ వరకు చేరింది. గంగూలీ సేన తుదిపోరులో ఆసీస్‌ చేతిలో ఓడి ట్రోఫీని చేజార్చుకుంది. ఆ తర్వాత 2007లో జరిగిన మెగాటోర్నీలో టీమిండియా పేలవ ప్రదర్శన చేసింది. గ్రూప్‌స్టేజ్‌లోనే వెనుదిరి విమర్శలపాలైంది. 28 ఏళ్లగా ఎదురుచూస్తున్న కలను ధోనీసేన 2011లో సాధించింది. భారత్-శ్రీలంక-బంగ్లాదేశ్‌ ఉమ్మడిగా ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగాసమరంలో టీమిండియా విజేతగా నిలిచింది. ఆ తర్వాత నుంచి జరిగిన వన్డే ప్రపంచకప్‌ల్లో భారత జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న ట్రోఫీని అందుకోలేకపోయింది. 2015లో ధోనీసేన, 2019 విరాట్‌ కోహ్లిసేన సెమీస్‌లోనే ఓడి నిష్క్రమించాయి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links