cricket
Home » World Cup 2023- పోరాటయోధుల వీడ్కోలకు వేళాయే..!

World Cup 2023- పోరాటయోధుల వీడ్కోలకు వేళాయే..!

by admin
0 comment

క్రికెట్ మెగా సమరం మొదలైంది. ప్రారంభమ్యాచ్‌ ఇంగ్లాండ్‌-న్యూజిలాండ్ హోరాహోరీగా సాగుతుందనకుంటే ఏకపక్షంగా సాగింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ను కివీస్‌ చిత్తు చేసి గత ఫైనల్‌ ప్రతీకారం తీర్చుకుంది. అయితే ప్రపంచకప్‌ సందడిని క్రికెట్‌ అభిమానులు ఆస్వాదిస్తున్నా.. మరోవైపు వారిని ఓ విషయం కలచివేస్తుంది. ఆరాధించే క్రికెట్ స్టార్స్‌కు ఇదే చివరి వన్డే వరల్డ్‌కప్‌ కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో లేని విధంగా ఈ కప్‌ అనంతరం ఎంతో మంది దిగ్గజాలు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారి ప్రయాణం.. వారి పోరాటం గురించి ఓ లుక్‌ వేద్దాం.

దేశంతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి. క్రికెట్‌ ప్రపంచం అతడిని రారాజుగా పిలుస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఏ ఆటగాడైనా ఒత్తిడికి లోనవుతుంటాడు. కానీ ఇతడు మాత్రం రెట్టింపు బలంతో ఆడతాడు. అందుకే రికార్డులే అతడి పేరుపై ఉండాలని పోటీపడుతుంటాయి. ఎన్ని పరుగులు చేసినా తీరని దాహం, ఛేదనలో తెగువ, ఫీల్డింగ్‌లో చిరుతలా కదలడం అతడికే సొంతం. అయితే ఎన్నో రికార్డులు సాధించిన కోహ్లి ప్రస్తుత వయస్సు 34 ఏళ్లు. మరో వన్డే సమరానికి అతడికి 38 ఏళ్లు వస్తాయి. ఆ సమయం వరకు ఫిట్‌నెస్‌, ఫామ్‌ను కొనసాగించాలంటే ఏ ఆటగాడికైనా సవాలే.

2011 ప్రపంచకప్‌ విజేత జట్టులో కోహ్లి సభ్యుడిగా ఉన్నాడు. ఫైనల్‌లో గంభీర్‌తో కలిసి అతడు చేసిన 83 పరుగుల భాగస్వామ్యం విజయంలో కీలకపాత్ర పోషించింది. ఆ సమయంలో కోహ్లి యంగ్‌ ప్లేయర్‌ అయినా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక 2015 ప్రపంచకప్‌ సమయానికి కోహ్లి.. కింగ్ కోహ్లిగా మారాడు. ఎన్నో అంచనాల మధ్య టోర్నీలో అడుగుపెట్టిన అతడు 305 పరుగులే చేశాడు. ఆ తర్వాత జరిగిన 2019 వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. బ్యాటింగ్‌లో రాణించినా సారథిగా కప్‌ను అందుకోలేకపోయాడు. 9 మ్యాచ్‌ల్లో 55కు పైగా సగటుతో 443 పరుగులు చేశాడు. అయితే శతకాల వీరుడిగా పేరొందిన కోహ్లి ఆ మెగాటోర్నీలో ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోవడం అభిమానులను కాస్త నిరాశపర్చింది. కానీ, ఈ సారి కోహ్లి సూపర్‌ ఫామ్‌లోకి వచ్చాడు. నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. అదే ఫామ్‌ను టోర్నీలోనూ ప్రదర్శిస్తే ఇక భారత్‌కు తిరుగుండదు.

మరో ఆటగాడు రోహిత్ శర్మ.. తొలిసారిగా వన్డే ప్రపంచ సమరంలో కెప్టెన్‌గా అడుగుపెడుతున్నాడు. సొంతగడ్డపై జరిగే ఈ మెగాటోర్నీలో దేశాన్ని విశ్వవిజేతగా నిలపాలని కసిగా ఉన్నాడు. మిడిలార్డర్‌ నుంచి ఓపెనర్‌గా మారిన తర్వాత రోహిత్ కెరీర్‌ మారిపోయింది. హిట్‌ మ్యాన్‌గా మారి పరుగుల వరద పారించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ అసాధ్యమని భావిస్తుంటే అతడు ఏకంగా మూడు ద్విశతకాలు బాదిన ఘనుడు. అయితే 2011 వన్డే ప్రపంచకప్‌నకు అతడు ఎంపిక కాలేదు. 2015లో ఓపెనర్‌గా వచ్చాడు. నిలకడగా రాణించి 330 పరుగులు చేశాడు. ఇక 2019 ప్రపంచకప్‌లో రోహిత్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 9 మ్యాచ్‌ల్లో 81 సగటుతో 648 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ఏకంగా అతడు అయిదు శతకాలు బాది రికార్డు సృష్టించాడు. అంతేగాక వన్డే ప్రపంచకప్పుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్‌తో కలిసి రికార్డును పంచుకుంటున్నాడు. ఈ సారి కూడా రోహిత్ అదే తరహా పరుగులు చేసి అభిమానుల పుష్కరకాలం కప్‌ కలను నెరవేర్చాలి. రోహిత్‌ ప్రస్తుత వయస్సు 36.

ఇక కోహ్లి-రోహిత్ కలిసి ఎన్నో శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు. కీలక ఇన్నింగ్స్‌లు ఆడి దేశాన్ని గెలిపించారు. సహచరులు విఫలమవుతున్నా జట్టు భాధ్యతలను భుజాన వేసుకొని సమర్థంగా మోశారు. అలాంటి ఈ దిగ్గజాలకు ఇదే చివరి ప్రపంచకప్‌ అనే విషయాన్ని క్రికెట్‌ అభిమానులు తీసుకోలేకపోతున్నారు.

మరోవైపు రవిచంద్రన్‌ అశ్విన్‌ వన్డే ప్రపంచకప్‌నకు అనూహ్యంగా ఎంపికయ్యాడు. టెస్టుల్లో హీరోగా ఉన్న అశ్విన్‌ వన్డేలకు దూరమై ఎన్నో నెలలు అయ్యింది. కానీ అక్షర్‌ పటేల్‌ గాయం అతడికి కలిసొచ్చింది. తన ఆటతో భారత్‌ను ఎన్నోసార్లు అశ్విన్‌ గెలిపించాడు. తన కెరీర్‌ ముగింపులో అతడికి మరో గొప్ప అవకాశం లభించింది. ఈ మెగాటోర్నీలోనూ సత్తాచాటి అతడు కప్‌ను ముద్దాడాలి. అశ్విన్‌ ప్రస్తుత వయస్సు 37. ఇక ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమికి ఇదే చివరి వన్డే కప్‌ అవ్వొచ్చు. జడేజా వయస్సు 34 ఏళ్లు కాగా షమికి 33 ఏళ్లు. మ్యాచ్‌ విన్నర్లు అయిన వీళ్లంతా ఛాంపియన్‌గా కెరీర్‌ను ముగించాలని ఎదురుచూస్తున్నారు.

కేవలం టీమిండియా ఆటగాళ్లే కాదు ప్రత్యర్థి జట్లలోని మ్యాచ్‌ విన్నర్లకు ఇదే ఆఖరి వన్డే ప్రపంచకప్‌ కానుంది. వారిలో న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ ఉన్నారు. మన తెలుగువాళ్లకు వీరిద్దరు ఎంతో స్పెషల్‌. ఐపీఎల్‌లో హైదరాబాద్‌ జట్టు తరఫున ఆడి మన ప్రేమను పొందారు. ఐపీఎల్‌లోనే కాకుండా వాళ్లు తమ దేశాల తరఫున గొప్పగా ఆడారు. 2015లో బ్యాట్స్‌మన్‌గా, 2019లో కెప్టెన్‌గా కివీస్‌ తరఫున కేన్‌ ప్రాతినిథ్యం వహించాడు.

గత ప్రపంచకప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ బౌండరీ కౌంట్‌తో ఓటమిపాలైంది. గొప్పగా పోరాడినా దురదృష్టం ఆ జట్టును వెంటాడింది. ఆ సమయంలో కేన్‌ను చూసి బాధపడని క్రికెట్‌ అభిమానులు ఉండరు. బాధను దాచుకుంటూ అతడు నవ్విన నవ్వును ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ టోర్నీలో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా కేన్‌ ఎంపికయ్యాడు. అదే టోర్నీలో డేవిడ్‌ వార్నర్‌ రెండో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. కేవలం ఒక్క పరుగు తేడాతో టాప్‌ స్కోరర్‌గా నిలవలేకపోయాడు. 647 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ఆస్ట్రేలియా స్టార్‌ ప్లేయర్లు స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌కు కూడా ఇదే ఆఖరి వన్డే ప్రపంచకప్‌. 34 ఏళ్ల స్మిత్, మాక్సీ.. క్రికెట్‌ అభిమానులకు ఎన్నో మధుర స్మృతులను అందించారు. క్లాసిక్‌ బ్యాటింగ్‌తో స్మిత్‌, విధ్వంసకర ఆటతో మాక్స్‌వెల్‌ ఆసీస్‌కు వెన్నెముకగా నిలిచారు. ఇక కీలక మ్యాచ్‌ల్లో స్మిత్ వికెట్‌ తీయాలంటే ప్రత్యర్థులకు పెను సవాలే. ఆ రీతిలో అతడు బ్యాటింగ్‌ చేస్తాడు. ఇక మాక్స్‌వెల్‌ కాసేపు క్రీజులో ఉన్నా ప్రత్యర్థికి చేయాల్సిన నష్టాన్ని చేసి వెళ్తుంటాడు. అతడు బ్యాటుతోనే కాకుండా బంతితోనూ రాణించగలడు. భారత్‌ పిచ్‌లపై అతడి స్పిన్‌ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆసీస్‌ జట్టులో మరో స్టార్ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఆటను కూడా వచ్చే ప్రపంచకప్‌లో చూడటం కష్టమే. కొత్తబంతిని అందుకుంటే స్టార్క్‌ ఎంతో ప్రమాదకరం. యార్కర్లు, స్వింగ్‌లకు అతడు స్పెషలిస్ట్‌. 2015 వన్డే ప్రపంచకప్‌లో అతడు ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయ్యాడు.

మరోవైపు న్యూజిలాండ్‌ జట్టులో విలియమ్సన్‌తో పాటు ట్రెంట్ బౌల్ట్‌, టిమ్‌ సౌథి కెరీర్‌ ముగింపుకు సమయం వచ్చింది. ఈ ముగ్గురు ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. అండర్‌-19లో దేశం తరఫున కలిసి ప్రాతినిథ్యం వహించారు. ఇప్పుడు తమ ఆఖరి వన్డే సమరంలోనూ ముగ్గురు కలిసే బరిలోకి దిగుతున్నారు. ఇక బౌల్ట్, సౌథి పేస్‌ ద్వయం ప్రత్యర్థులకు ఎప్పుడూ సవాలే.

దక్షిణాఫ్రికా జట్టులోనూ స్టార్‌ ప్లేయర్లు డేవిడ్ మిల్లర్‌, క్వింటన్‌ డికాక్‌ తమ ఆఖరి వన్డే ప్రపంచకప్‌నకు సిద్ధమయ్యారు. ఇప్పటికే డికాక్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాడు. అయితే ఐపీఎల్‌తో భారత్‌ పిచ్‌లపై వీరిద్దరు అపారనుభవం పొందారు. తమ అత్యుత్తమ ఆట తీరుతో దక్షిణాఫ్రికాకు తొలి కప్‌ను అందించాలని కసిగా ఉన్నారు. ఎడమచేతి వాటం బ్యాటర్లు అయిన వీరిద్దరూ విధ్వంసకర ఆటగాళ్లే.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ జట్టులో మొయిన్‌ అలీ, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌కు కూడా ఇదే చివరి మెగా సమరం. రిటైర్మెంట్‌ వెనక్కితీసుకొని మరి బెన్‌ స్టోక్స్‌ తిరిగొచ్చాడు. గత ప్రపంచకప్‌ హీరో అయిన స్టోక్స్‌ ఈ సారి కూడా చెలరేగాలని చూస్తున్నాడు. స్టోక్స్‌తో పాటు అలీ కూడా ఆల్‌రౌండర్‌గా జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అంతేగాక బట్లర్‌ ఈసారి జట్టును నడిపిస్తున్నాడు. ఈ ముగ్గురూ భారీ హిట్టర్లే. వీరితో పాటు జో రూట్ కూడా ఆఖరి వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశం ఉంది. వీళ్లంతా టైటిల్‌ను సాధించి కెరీర్‌కు ఘన ముగింపు ఇవ్వాలని చూస్తున్నారు.

మరో ఆటగాడు షకిబ్‌ అల్‌ హసన్‌. చిన్న జట్టు అయిన బంగ్లాదేశ్‌లో ఉన్న షకిబ్‌ దిగ్గజ క్రికెటర్‌గా ఎదిగాడు. ఈ సారి కెప్టెన్‌గా షకిబ్‌ జట్టును నడిపిస్తున్నాడు. అతడు జట్టులో ఉంటే సమీకరణం మారిపోతుంటుంది. ఉత్తమ ఆల్‌రౌండర్‌గా ఎన్నో విజయాలు అందించాడు.

ఇంతమంది ప్లేయర్లకు ఇదే చివరి వన్డే ప్రపంచకప్‌ కానుంది. దీంతో క్రికెట్‌లో ఒక జనరేషనే రిటైర్మెంట్‌ తీసుకోనుంది. ఇన్నేళ్లు వాళ్లంతా దేశాల భారాన్ని దిగ్విజయంగా మోశారు. ఇక తమ బాధ్యతలను వారసులకు అప్పగించి.. వీడ్కోలు తీసుకునేందుకు వేళ అయ్యింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links