southafrica
Home » దక్షిణాఫ్రికా అదే జోరు.. రన్‌రేట్‌లో టాప్‌

దక్షిణాఫ్రికా అదే జోరు.. రన్‌రేట్‌లో టాప్‌

by admin
0 comment

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా దూసుకెళ్తోంది. నెదర్లాండ్స్‌ చేతిలో భంగపాటు మినహా టోర్నీ ఆద్యంతం విజృంభిస్తుంది. హేమాహేమీ ప్రత్యర్థులను పసికూనలా మార్చేస్తుంది. ఆ జోరును రిపీట్‌ చేస్తూ మంగళవారం బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. 149 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా పరుగుల వరద పారించింది. 5 వికెట్లు కోల్పోయి 382 పరుగుల భారీ స్కోరు సాధించింది. క్వింటన్ డికాక్‌ (174) భారీ శతకం సాధించగా,హెన్రిచ్‌ క్లాసెన్‌ (90) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆఖర్లో మిల్లర్‌ (34*) కూడా సిక్సర్ల మోత మోగించడంతో మరోసారి భారీస్కోరు సాధించింది. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 233 పరుగులకే కుప్పకూలింది.

అయితే టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించలేదు. 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. హెండ్రిక్స్‌ (12), డసెన్‌ (1) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ మార్క్రమ్‌ (60)తో కలిసి డికాక్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి నిలకడగా ఆడుతూ మూడో వికెట్‌కు 137 పరుగులు జోడించారు. అయితే మార్క్రమ్‌ ఔటైనా తర్వాత మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. డికాక్‌, క్లాసెన్‌ బౌండరీల మోత మోగించారు. వీరిద్దరు 87 బంతుల్లో 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తన కెరీర్‌లో 150 వన్డే ఆడుతున్న డికాక్‌ 101 బంతుల్లో శతకం సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో అతడికిది మూడో సెంచరీ. తర్వాత గేర్‌ను మార్చిన డికాక్‌ 129 బంతుల్లోనే 150 పరుగులు చేశాడు. అయితే అతడు భారీ షాట్‌కు యత్నించి డబుల్ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. మరోవైపు క్లాసెన్‌ సిక్సర్లతో బంగ్లాకు చుక్కలు చూపించాడు. 34 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన అతడు తర్వాత మరింత చెలరేగాడు. అయితే ఆఖరి ఓవర్లో ఔట్వడంతో సెంచరీ మిస్ అయ్యాడు. దక్షిణాఫ్రికా ఆఖరి 10 ఓవర్లలో 144 పరుగులు చేయడం విశేషం.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ ఆది నుంచే తడబడింది. సఫారీ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. 58 పరుగులకే సగం మంది ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరారు. దీంతో బంగ్లాపై దక్షిణాఫ్రికా రికార్డు విజయం సాధిస్తుందని భావించారంతా. కానీ మహ్మదుల్లా గొప్పగా పోరాడాడు. 111 బంతుల్లో 111 పరుగులు చేశాడు. అయితే అతడి ఒంటరి పోరాటం భారీ టార్గెట్‌ను అందుకోనప్పటికీ.. పోరాటపటిమతో ఆకట్టుకున్నాడు. సహచరుల నుంచి సహకారం లభించనప్పటకీ స్కోరుబోర్డును గొప్పగా నడిపించాడు. అయితే 227 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌గా అతడు మైదానాన్ని వీడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కొయెట్జీ మూడు వికెట్లు, జాన్సన్‌, లిజాడ్‌, రబాడ తలో రెండు, కేశవ్‌ ఒక్క వికెట్‌ తీశారు.

ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్స్‌ టేబుల్‌లో రెండో స్థానానికి చేరింది. అయిదు మ్యాచ్‌లు ఆడిన సౌతాఫ్రికా నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సాధించింది. అయితే సఫారీసేన నెట్‌రన్‌రేటు అన్ని జట్ల కంటే మెరుగ్గా ఉంది. +2.370 సాధించింది. ఇక నెట్‌రన్‌రేట్ పరంగా న్యూజిలాండ్ (+1.481), భారత్‌ (1.353) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links