కంటెంట్ వీక్ గా ఉన్నప్పుడు ప్రమోషన్ పీక్స్ లో ఉంటుందనేది అందరికీ తెలిసిందే. దీన్ని నిజం చేస్తూ వచ్చింది ఆదికేశవ సినిమా. భారీగా ప్రచారం చేసిన ఈ సినిమా మొదటి రోజుకే తేలిపోయింది. ఇక కోటబొమ్మాలి పీఎస్ సినిమాకు కూడా గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ఒరిజినల్ అంత కాదు కాని, ఇది కూడా ఓ మోస్తరుగా ఆకట్టుకుంటోంది.
అయితే వీటితో పాటు వచ్చిన ఓ సినిమా మాత్రం బయట పెద్దగా సౌండ్ చేయడం లేదు. కానీ థియేటర్లలో మాత్రం బాగానే సౌండ్ చేస్తోంది. అదే సౌండ్ పార్టీ సినిమా. ఈ వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఉంది. ఆదికేశవ రేంజ్ లో దీనికి ప్రచారం చేయలేకపోయినా, థియేటర్లలోకి విడుదలైన తర్వాత ఈ సినిమాకు ప్రచారం అక్కర్లేకుండా పోయింది. మంచి మౌత్ టాక్ తో ఇది మెల్లమెల్లగా అందుకుంటోంది.
పూర్తిగా కామెడీ కాన్సెప్ట్ తో తీసిన సినిమా ఇది. వీజే సన్నీ, శివన్నారాయణ పాత్రలే హైలెట్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. మల్టీప్లెక్సుల్ని పక్కనపెడితే.. బి, సి సెంటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
గతంలో పేపర్ బాయ్ లాంటి హిట్ సినిమా తీసిన జయశంకర్, ఈ సినిమాతో ప్రజెంటర్ గా మారాడు. తన ఫ్రెండ్ సంజయ్ శేరికి మెగాఫోన్ అందించాడు. సంజయ్ స్వయంగా ఈ కథ రాసుకొని, దర్శకత్వం వహించాడు. పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, కామెడీ క్లిక్ అవ్వడంతో సింగిల్ స్క్రీన్స్ లో సౌండ్ పార్టీ గట్టిగానే సౌండ్ చేస్తోంది.