ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి ఎన్నికను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన అంశంలో ఈ తీర్పు వెలువరించింది. రెండో స్థానంలో ఉన్న భాజపా అభ్యర్థి డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించింది. అంతేగాక కృష్ణమోహన్‌రెడ్డికి రూ.2.5 లక్షల జరిమానా విధించింది. పిటిషనర్ డీకే అరుణకు పిటిషన్ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలని ఆదేశించింది.
కాగా, డీకే అరుణ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. భారాసా అభ్యర్థిగా పోటీచేసిన కృష్ణమోహన్ రెడ్డి ఆమెపై దాదాపు 29వేల ఓట్ల తేడాతో గెలిచారు. అయితే కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ డీకే అరుణ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. ఇటీవల కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై కూడా హైకోర్టు అనర్హత ఓటు వేసిన సంగతి తెలిసిందే.