ప్రపంచకప్ మహా సమరంలో అంతిమ ఘట్టానికి వేళ అయింది. 45 రోజుల పాటు సాగిన ఈ ప్రపంచకప్‌లో అహ్మదాబాద్ వేదికగా తుదిపోరుకు రంగం సిద్ధమైంది. నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్‌లో భారత్-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, టోర్నీలో ఓటమెరుగని జట్టు అయిన టీమిండియానే ఫేవరేటు. కానీ అయిదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేం. మరి, 140 కోట్ల భారతీయుల ఆశల భారాన్ని మోస్తున్న రోహిత్ సేన.. ఫైనల్‌లో విజయతీరాలకు చేరుతుందా? రెండు దశాద్దాల క్రితం జరిగిన తుదిపోరులో మనకి కన్నీటిని మిగిల్చిన కంగారూలపై.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? అప్పటి చేదు జ్ఞాపకాలను చెరిపి చరితను లిఖిస్తుందా? క్రికెట్ ప్రపంచానికి మనజట్టు జగజ్జేతగా నిలుస్తుందా? వీటి అన్నింటికి మరికొన్ని గంటల్లోనే సమాధానం దొరకనుంది.
ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. భారత వాయు సేనకు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్స్ బృందం విన్యాసాలు మధ్యాహ్నం 1.35 గంటలకు ఆరంభమవుతాయి. ఈ విన్యాసాలు 15 నిమిషాల పాటు సాగుతాయి.
ఫస్ట్ ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్‌లో ఆదిత్య గాద్వి కార్యక్రమం ఉంటుంది. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ప్రితమ్, జోనితా గాంధీ, నక్షా అజిజ్, అమిత్ మిశ్రా, ఆకాశ్ సింగ్, తుశార్ జోషిల కార్యక్రమం ఉంటుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్‌లో లేజర్ & లైట్ షో ఉంటుంది.