మధ్యాహ్నం భోజనం తర్వాత చాలా మందికి నిద్ర వస్తుంటుంది. స్కూల్ లో స్టూడెంట్స్ నుంచి ఆఫీసర్ల వరకు లంచ్ తర్వాత కాస్త కునుకు వేస్తే బాగుంటుందని ఎంతో మంది భావిస్తుంటారు. కానీ అందరికీ అది సాధ్యంకాదు. అలాగే నిద్ర రాకపోమయినా చాలా మందికి మధ్యాహ్నం లేజీగా అనిపిస్తుంటుంది. అయితే దీన్ని అధిగమించడానికి కొన్ని చిట్కాలున్నాయి.
మధ్యాహ్నం నిద్రకు అత్యంత సాధారణ కారణాలలో ఒకటి రాత్రి సరిగ్గా నిద్రలేకపోవడం. రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. ఒకవేళ అది మిస్ అయితే దాన్ని ప్రభావం మధ్యాహ్నం తప్పకపడుతుంది. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కారణం అవుతాయి. థైరాయిడ్, స్లీప్ ఆప్నియా, రక్తహీనత, శారీరక, మానసిక ఒత్తిడి, మధుమేహం వంటి మొదలైన సమస్యల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. బ్లడ్ షుగర్ స్పైక్‌లు, తగినంత నిద్ర లేకపోవడం కూడా ఓ కారణమవుతుంది. అంతేకాకుండా నిద్ర టైమింగ్స్‌లో మార్పులు చోటు చేసుకోవడం వల్ల కూడా పగటిపూట నిద్ర ప్రభావితమవుతుంది.
లంచ్ తర్వాత బద్ధకంగా ఉండటానికి తీసుకునే ఆహారం కూడా ఓ కారణం. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కాస్త అలసిపోయేలా చేస్తాయి. అధిక కొవ్వు కలిగిన ఫుడ్స్ బద్ధకాన్ని ఇస్తాయి. అలాగే ఆహార పరిమాణం కూడా నిద్రపై ప్రభావం చూపిస్తుంది. ఎక్కువగా తింటే కచ్చితంగా బద్ధకంగా అనిపిస్తుంది. ఇక మాంసాహారం ఎక్కువగా తీసుకున్నా నిద్ర ఎక్కువగా వస్తుంది. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు మీ రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. కాబట్టి అన్ని ముఖ్యమైన పోషకాలు కలిగిన సమతుల్యమైన భోజనాన్ని మితంగా తీసుకోవాలి. ఇది అడెనోసిన్ స్థాయిలను ఆధీనంలో ఉంచుతుంది. అప్పుడు పగటి నిద్ర తగ్గుతుంది. మధ్యాహ్న భోజనం పూర్తి చేసిన తర్వాత కొంత సమయం తీసుకుని వాకింగ్ లేదా బేసిక్ స్ట్రెచింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చురుకుగా ఉండేలా చేస్తాయి. అయితే నిద్రలేమి, స్లీప్ ఆప్నియా వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలి.