టీడీపీ కీలకనేత నారా లోకేశ్‌ను అక్టోబర్ 4వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని ఆంధ్రపద్రేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ లోకేశ్ శుక్రవారం హైకోర్టులో లంచ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం బుధవారం వరకు వాయిదా వేసింది. అప్పటివరకు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లోకేశ్‌ను అరెస్టు చేయొద్దని పేర్కొంది. కానీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌కు ముందస్తు బెయిల్ నిరాకరించింది. సీఐడీ విచారణకు సహకరించాలని సూచించింది.
ఏంటీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు?
అమరావతిలో 97 కి.మీ మేర ఇన్నర్ రింగ్ రోడ్డు వేయాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం కాకుండా లింగమనేని రమేశ్, హెరిటేజ్, మాజీ మంత్రి నారారయణకు చెందిన భూములకు ఆనుకుని రింగ్ రోడ్డు వెళ్లేలా అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో వాళ్ల భూముల ధరలు భారీగా పెరిగాయంటోంది. మరోవైపు టీడీపీ.. అసలు రింగ్ రోడ్డే వేయలేదని, ఇది క్విడ్ ప్రో కో ఎలా అవుతుందని ప్రశ్నిస్తోంది.