ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలులో ఏపీకి చెందిన 178 మంది ప్రయాణికులు ఉన్నట్లు వాల్తేరు డీఆర్ఎం వెల్లడించారు. వంద మందికి పైగా విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నట్లు చెప్పారు. వీరితోపాటు జనరల్ బోగీలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. బాలేశ్వర్ నుంచి ప్రత్యేక రైలు మరో 2 గంటల్లో విశాఖ రానున్నట్లు చెప్పారు. మరోవైపు విశాఖ నుంచి మరమ్మతు సిబ్బందితో ఒక రైలు బాలేశ్వర్ వెళ్తోందన్నారు. యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో ఎంతమంది ఏపీ వాసులున్నారో తేలాల్సి ఉందని అన్నారు.
తెలుగు ప్రయాణికులకు సంబంధించి మృతులు, గాయపడ్డవారు, మిస్సింగ్ వివరాల సమాచారం అధికార్లు సేకరిస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలురు, కృష్ణా జిల్లా కలక్టరేట్ లలో కంట్రోల్ రూం లు ఏర్పాటు చేశారు. విజయవాడ లో దిగాల్సిన 39 మందిలో 23 మంది కాంటాక్ట్ లోకి వచ్చారు. 5గురు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి. 2 ఫోన్ లు నాట్ రీచబుల్, మరో 5 మందికి చెందిన ఫోన్లు పనిచేయడం లేదు.
ఇక ప్రమాదానికి కారణమైన యశ్వంతపూర్ నుండి హౌరా వెళ్లే రైలులో చీరాల నుండి ఆరుగురు ప్రయాణించారు. రైలు ప్రమాద విషయం తెలియగానే వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తాము క్షేమంగా ఉన్నట్లు ఫోను ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపారు ఆ ఆరుగురు ప్రయాణికులు. చీరాల నుండి రెడీమేడ్ దుస్తులు కొనేందుకు కలకత్తా వెళ్లారు వీళ్లంతా.