chandrayan history
Home » Chandrayaan History -చంద్రయాన్‌ చరిత్ర

Chandrayaan History -చంద్రయాన్‌ చరిత్ర

by admin
0 comment

యావత్‌ భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. భవిష్యత్తులో జాబిల్లిపై మానవ అవాసాల ఏర్పాటుకు బాటలు పడటానికి ‘చంద్రయాన్‌-3’ ఎంతో కీలకం. అన్నీ సజావుగా సాగితే ఇవాళ సాయంత్రం దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ చేసిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో ‘చంద్రయాన్‌’ చరిత్ర గురించి తెలుసుకుందాం.

జాబిల్లిని చేరుకునేందుకు మనం కాస్త ఆలస్యంగా బరిలోకి దిగాం. 1959 నుంచే సోవియట్‌ యూనియన్‌, అమెరికా చందమామను చేరేందుకు నువ్వానేనా అన్నట్లుగా పోటీపడ్డాయి. తొలిసారిగా చంద్రుడి కక్ష్యలోకి వ్యోమనౌక చేర్చిన ఘనతను సోవియట్‌ యూనియన్‌ దక్కించుకుంది. 1959 జనవరిలో లూనా-1తో సాధించింది. అంతేకాదు, జాబిల్లిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన తొలి ఘనతను కూడా సోవియట్‌ యూనియనే అందుకుంది. 1966 జనవరిలో ‘లూనా-9’ వ్యోమనౌకను చంద్రుడిపై దింపింది.

మరోవైపు అమెరికా చందమామపైకి మానవుడిని పంపి చరిత్ర సృష్టించింది. అపోలో మిషన్‌లో భాగంగా 1969 జులై 20న నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, బజ్‌ ఆల్ట్రిన్‌లు తొలిసారి జాబిల్లిపై కాలుమోపారు. ఆ తర్వాత 1972 వరకు మొత్తం 12 మంది చంద్రుడిని చేరుకున్నారు. ఆ తర్వాత ఎవరూ వెళ్లలేదు. అయితే రష్యా 1970లో లూనా-16 సాయంతో చంద్రుడి ఉపరితలంపై ఉన్న నమూనాలను తీసుకువచ్చిన మొదటి దేశంగా నిలిచింది.

కాస్త లేట్‌ అయినా.. భారత్ లేటెస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ను ప్రపంచానికి అందించింది. భారతదేశం నుంచి చంద్రుడిపైకి వెళ్లిన మొదటి అంతరిక్ష నౌక చంద్రయాన్‌-1. జాబిల్లిపై తొలి ప్రయోగంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు అద్భుత ఘనత సాధించారు. అయితే చంద్రయాన్‌ గురించి మాజీ ప్రధాని వాజ్‌పేయి 2003 ఆగస్ట్‌ 15న మొదటిసారి అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఇస్రో అయిదేళ్లకు ప్రయోగం చేపట్టింది. 2008 అక్టోబర్‌ 22న షార్‌ వేదికగా చంద్రయాన్‌-1 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. నవంబర్‌ 8న జాబిల్లి కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశించింది. దానిలోని మూన్‌ ఇంపాక్ట్‌ ప్రోబ్‌ ప్రపంచానికి కచ్చితమైన సమాచారాన్ని అందించింది. చంద్రుని ఉపరితలం కింద నీరు ఘనరూపంలో ఉన్నట్లు తేల్చిచెప్పింది. అంతేగాక జాబిల్లి ఉపరితలంపై అల్యూమినియం, సిలికాన్, మెగ్నిషియం, కాల్షియం వంటి మూలకాల ఉనికిని గుర్తించింది. ఇక టెర్రైన్‌ మ్యాపింగ్ కెమెరా.. స్పష్టతతో కూడిన త్రీడీ చిత్రాలను భూమికి అందించింది. ఆ తర్వాత దాదాపు 8 నెలల అనంతరం చంద్రయాన్‌-1 జీవిత కాలం ముగిసింది.

చంద్రయాన్‌-1 కొనసాగింపుగా చంద్రయాన్‌-2ను భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా 2019లో చేపట్టింది. అప్పటివరకు ఎవరూ సాహసించని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయాలని ఇస్రో నిర్ణయించుకుంది. 2019 జులై 22న శ్రీహరికోట నుంచి ప్రయోగించింది. 48 రోజుల ప్రయాణం తర్వాత ఆర్బిటర్‌ చందమామ కక్ష్యలో దిగ్విజయంగా చేరింది. అయితే సెప్టెంబర్‌ 6న సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేస్తున్న సమయంలో 2 కిలోమీటర్ల ఎత్తులో సాంకేతిక సమస్య తలెత్తింది. నియంత్రణ కోల్పోయి క్రాష్‌ ల్యాండింగ్‌ అయ్యింది. ల్యాండర్, రోవర్‌ ధ్వంసమయ్యాయి. విక్రమ్‌ ల్యాండర్‌ ఇస్రో గ్రౌండ్‌ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయాయని ఇస్రో ప్రకటించింది. తిరిగి కమ్యూనికేషన్‌ పునరుద్ధరించేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేదు. ఆ సమయంలో దేశమంతా కన్నీరు పెట్టింది. భావోద్వేగానికి గురైన ఇస్రో చైర్మన్‌ శివన్‌ను ప్రధాని మోదీ హత్తుకుని ఓదార్చిన సంఘటన.. ఇప్పటికీ అందరి మదిలోనే ఉంది.

అయితే చెదిరిన కలను తిరిగి సాధించేందుకు, భారత్‌ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇస్రో రెట్టింపు ఉత్సాహంతో సిద్ధమైంది. నాలుగేళ్ల తర్వాత వైఫల్య ఆధారిత డిజైన్‌తో చంద్రయాన్‌-3ను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలు మోస్తూ జులై 14న చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది. నిర్దేశించిన లక్ష్యాలను ఛేదిస్తూ భారత వ్యోమనౌక అపూర్వ ఘట్టానికి చేరుకుంది. మరికాసేపట్లో సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ చేపట్టనుంది. అది విజయం సాధించాలని దేశమంతా కోరుకుంటుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links