వాతావరణంలో కాస్త మార్పులు వచ్చినా, డస్ట్ ద్వారా చాలా మందికి అలర్జీలు వెంటనే వస్తుంటాయి. కళ్లు ఎర్రబారడం, కళ్లు, ముక్కు వెంట నీరుకారడం, చర్మంపై దురదలు, దద్దుర్లు వస్తుంటాయి. కొందరికి అయితే శ్వాస సంబంధిత సమస్యలు వస్తుంటాయి. అయితే వాటిని ఇంటి చిట్కాలతో నివారించుకోవచ్చు. చెట్ల పుప్పొడి, దూళీలోని సూక్ష్మక్రిములు, పెంపుడు జంతువుల చుండ్రు, కొన్ని ఆహార పదార్థాలు, మందులు, పర్‌ఫ్యూమ్స్, ఇతరత్ర స్మెల్స్ అలర్జీకి ముఖ్య కారణాలుగా చెప్తుంటారు.
అలర్జీ ద్వారా శ్వాసకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు బొప్పాయి, అనాస పండ్లు తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ముక్కు సంబంధించిన అలర్జీలకు పెరుగు వంటి పులిసిన ఆహారాల ద్వారా లభించే మంచి బ్యాక్టీరియా ఎంతో మేలు చేస్తుంది. ఇక వైద్యుల సలహామేరకు సీ విటమిన్ తీసుకుంటే.. తుమ్ములకు కారణమయ్యే హిస్టమైన్ రసాయన స్థాయి శరీరంలో తగ్గుతుంది. వాటితో పాటు తాజా ఆకుకూరలు, పండ్లు, నట్స్ వంటివి అలర్జీ లక్షణాలను తగ్గిస్తాయి. ద్రాక్ష, యాపిల్, ఆరెంజ్, టమాటాలు , పండ్ల రసాలు ఎంతో ఊరట కలిగిస్తాయి. ఆవిరి పట్టడంతో ముక్కు కారడాన్ని తగ్గించవచ్చు.
డస్ట్ అలర్జీని నివారించుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా సహాయపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో మూడు స్పూన్‌ల ఆపిల్ సైడర్ వెనిగర్, రెండు స్పూన్‌ల తేనే వేసి బాగా కలిపి, రోజూ పరగడుపున తాగడం అలవాటు చేసుకోవాలి. ఆపిల్ సైడర్ వెనిగర్‌లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు అలర్జీని నివారిస్తాయి. పసుపులో కూడా ఇవే గుణాలు ఉంటాయి. వేడి పాలలో అర టీస్పూన్ పసుపు, చిటికెడు నల్ల మిరియాలు, కొన్ని చుక్కల తేనె వేసి బాగా కలిపి రోజూ తీసుకోవాలి.
అలాగే అలర్జీని తగ్గించుకునేందుకు 3 లేదా 4 చుక్కలు యాకలిప్టస్ ఆయిల్ తీసుకొని, బాగా మరిగే నీటిలో వేసి ఆవిరి పట్టుకోవాలి. ఈ నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అలర్జీని తగ్గించడంలో ఉపయోగపడతాయి. కాగా, ఫుడ్ వల్ల వచ్చే అలర్జీని నివారించాలంటే దానికి సంబంధించిన ఆహారపదార్థాలను కచ్చితంగా దూరం పెట్టాలి. రక్తపరీక్ష ద్వారా మన శరీరానికి పడని ఆహారపదార్థాలను తెలుసుకోవచ్చు. టీ ట్రీ ఆయిల్ చర్మ అలర్జీలను తగ్గిస్తుంది. అయితే శ్వాస సమస్యలు, ఛాతి పట్టేయడం, రక్తపోటులో మార్పులు, వాంతులు వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. ఇంటి చిట్కాలతో సరిపెట్టుకోవద్దు.