భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు పోటాపోటీగా సాగుతోంది. తొలి టెస్టులో పేలవ ప్రదర్శన చేసిన విండీస్ ఆఖరి టెస్టులో మాత్రం పట్టుదలతో పోరాడుతుంది. మూడో రోజు ఆట ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో అలిక్ అథనేజ్ (37), హోల్డర్ (11) ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 438 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ఓవర్‌నైట్ స్కోరు 86/1 తో ఆటను ఆరంభించిన వెస్టిండీస్ ఆచితూచి ఆడింది. దాదాపు 34 ఓవర్లలో 57 పరుగులే చేసింది. రిస్క్ షాట్లకు ప్రయత్నించకుండా జాగ్రత్తగా ఆడింది. కానీ భారత బౌలర్లు ఆతిథ్యజట్టు బ్యాట్స్‌మెన్‌ను తెలివిగా బోల్తాకొట్టించారు. సెంచరీ దిశగా సాగుతున్న ప్రత్యర్థిజట్టు సారథి బ్రాత్‌వైట్ (75) ను అశ్విన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. చంద్రపాల్ (33), మెకంజి (32), డసల్వా (10), బ్లాక్‌వుడ్ (20) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో జడేజా రెండు వికెట్లు తీయగా, అశ్విన్, సిరాజ్, ముకేష్ తలో వికెట్ తీశారు.
అయితే వరుణుడి రాకతో అరగంటసేపు మ్యాచ్‌ను నిలిపివేయడంతో శనివారం 67 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. కోల్పోయిన ఆటను భర్తీ చేయడానికి నేడు అరగంట ముందే మ్యాచ్ ప్రారంభమవుతుందని అంపైర్లు ప్రకటించారు.