Home » Skanda Review | స్కంద మూవీ రివ్యూ

Skanda Review | స్కంద మూవీ రివ్యూ

by admin
0 comment

తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల, సయీ మంజ్రేకర్, గౌతమి, శ్రీకాంత్ తదితరులు
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సంగీతం: ఎస్ఎస్ థమన్
డీవోపీ: సంతోష్ డిటాకే
ఎడిటింగ్: తమ్మిరాజు
రన్ టైమ్: 2 గంటల 47 నిమిషాలు
సెన్సార్: UA
రేటింగ్: 2.5/5

బోయపాటి సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ యాక్షన్ ఉంటుంది. అడుగడుగునా హింస కనిపిస్తుంది. అయితే పెద్ద హీరోలకు మాత్రమే ఆ ఓవర్ డోస్ హెవీ-యాక్షన్ వర్కవుట్ అవుతుంది. కుర్ర హీరోలతో సినిమాలు తీసినప్పుడు తననుతాను తగ్గించుకోలేకపోతున్నాడు బోయపాటి. దీంతో అది మరింత ఓవర్ అనిపిస్తుంది. గతంలో రామ్ చరణ్, బెల్లంకొండ విషయంలో అదే జరిగింది. ఇప్పుడు రామ్ పోతినేని విషయంలో కూడా అదే రిపీటైంది.

తన ప్రతి సినిమాలో డ్యూయల్ రోల్ ఉండాలని బోయపాటి గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు. స్కందలో కూడా రామ్ ను డ్యూయల్ రోల్ లో చూపించాడు. అయితే అతడు చూపించిన పద్ధతి బాగుంది కానీ, ఒకడు కాదు ఇద్దరున్నారని చెప్పిన విధానం మాత్రం బాగాలేదు. ఇంకా చెప్పాలంటే, క్లయిమాక్స్ లో ఓ షాకింగ్ ఎలిమెంట్ గా దీన్ని ప్రజెంట్ చేయాలని భావించిన బోయపాటి, టోటల్ గా కన్ఫ్యూజ్ చేసి పడేశాడు.

ఎప్పట్లానే స్కందలో కూడా కథ కంటే యాక్షన్ పార్టే ఎక్కువగా ఉంది. ఫస్టాఫ్ మొత్తం ఫైట్లు, సాంగ్స్ తో నిండిపోయింది. ఇంటర్వెల్ బ్లాక్ కు వచ్చేసరికి అసలు మేటర్ బయటపడుతుంది. ఈసారి కూడా లార్జర్ దేన్ లైఫ్ స్టోరీనే ఎంచుకున్నాడు బోయపాటి. ముఖ్యమంత్రులు, సీబీఐ, పారిశ్రామికవేత్తల మధ్య కథను నడిపించాడు.

ఇటువైపు ఓ రాష్ట్రం, అటువైపు మరో రాష్ట్రం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఒక స్టేట్ సీఎం కూతుర్ని, మరో స్టేట్ సీఎం కొడుకు లేపుకెళ్లిపోతాడు. ఇద్దరు ముఖ్యమంత్రుల గొడవ మధ్యలోకి హీరో ఎంటర్ అవుతాడు. ఆ సీఎం ఇంటి నుంచి తన కూతుర్ని తీసుకురమ్మని హీరోను పంపిస్తాడు ఈ స్టేట్ సీఎం. భారీ ఫైట్ మధ్య సీఎం బంగ్లాలోకి ఎంటరైన హీరో.. ఇద్దరు ముఖ్యమంత్రుల కూతుళ్లను ఎత్తుకొస్తాడు.

అసలు హీరో ఎందుకు ఈ పని చేశాడు.. ఇద్దరు ముఖ్యమంత్రులతో అతడికి ఉన్న గొడవేంటి.. ఫైనల్ గా ముఖ్యమంత్రులిద్దరూ దారికొచ్చారా లేదా.. ఈ మొత్తం కథలో శ్రీకాంత్ రోల్ ఏంటనేది స్కంద స్టోరీ.

తన ప్రతి సినిమాలో చూపించినట్టుగానే ఇందులో కూడా భారీతనం చూపించాడు బోయపాటి. సెటప్ లోనే కాకుండా, ఫైట్స్ లో కూడా తన మార్క్ ప్రజెంట్ చేశాడు. ఈ క్రమంలో లాజిక్స్ తో పాటు కథను కూడా కాస్త పక్కనపెట్టినట్టు కనిపించింది. అదే ఈ సినిమాకు మైనస్ అయింది. అడుగడుగునా వచ్చే ఫైట్లు, చెవులు దిమ్మెత్తిపోయే లౌడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇబ్బందిపెడతాయి. దీనికితోడు సినిమాలో పూర్తిగా లాజిక్స్ మిస్సయ్యాయి. యాక్షన్ సన్నివేశాల్లోనే కాదు, కథలో కూడా లాజిక్స్ మిస్సవ్వడం ఇబ్బంది పెడుతుంది. ఇక పాటల విషయానికొస్తే, ఒక్క పాట మినహా మిగతావేవీ పెద్దగా ఆకట్టుకోవు.

హీరో రామ్ మాత్రం తన మేకోవర్, యాక్షన్ తో మెప్పించాడు. తన ఇమేజ్ కంటే ఎక్కువ బరువున్న యాక్షన్ సన్నివేశాల్లో అతడు తడబడలేదు. మేకోవర్ కోసం అతడు కాస్త బరువు పెరిగిన విషయం కూడా స్క్రీన్ పై కనిపిస్తుంది. హీరోయిన్ శ్రీలీల చూడ్డానికి బాగుంది. కానీ ఆమెకు నటించే అవకాశం ఇవ్వలేదు దర్శకుడు. కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్, తన సీనియారిటీ చూపించాడు. ఎమోషనల్ సీన్స్ లో మెప్పించాడు. మరో హీరోయిన్ సయీ మంజ్రేకర్ చక్కగా నటించింది. ఇతర పాత్రలన్నీ తమ పరిధి మేరకు నటించాయి.

టెక్నికల్ గా చూసుకుంటే, సినిమాటోగ్రఫీ, సెట్స్, ఫైట్స్ బాగున్నాయి. అన్నట్టు ఈ సినిమాలో కూడా మరికొన్ని కొత్త ఆయుధాల్ని పరిచయం చేశాడు దర్శకుడు. అఖండకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తమన్, స్కంద విషయంలో మాత్రం ఆ బెంచ్ మార్క్ ను అందుకోలేకపోయాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్ గా బోయపాటి స్టయిల్ ఇష్టపడే ప్రేక్షకుల్ని, రామ్ ఫ్యాన్స్ ను మాత్రమే స్కంద సినిమా ఆకట్టుకుంటుంది. లాజిక్స్ గురించి ఆలోచించకుండా, ప్యూర్ యాక్షన్ మాత్రమే కోరుకునేవాళ్లు ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links