నటీనటులు : సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయసుధ, శరత్ బాబు, వనిత విజయకుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం తదితరులు
రచన , దర్శకత్వం: ఎంఎస్ రాజు
నిర్మాత: నరేష్ వికె
బ్యానర్: విజయ కృష్ణ మూవీస్
సంగీతం: సురేష్ బొబ్బిలి
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: అరుల్ దేవ్
డీవోపీ: ఏంఎన్ బాల్ రెడ్డి
ఎడిటర్: జునైద్ సిద్ధిక్
రన్ టైమ్: 2 గంటల 11 నిమిషాలు
సెన్సార్: UA
రేటింగ్: 2.5/5
అందరి డౌట్స్ క్లియర్ అయ్యాయి. మళ్లీ పెళ్లి సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఇది అచ్చంగా సీనియర్ నటుడు నరేష్ జీవితంలో జరిగిన ఘటనలతో తెరకెక్కింది. కాకపోతే గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇందులో వాస్తవమైన ఎపిసోడ్స్ ఏంటనేది చెప్పడం చాలా కష్టం. బెంగళూరు హోటల్ సీన్, రమ్య రఘుపతితో ఉన్న వివాదాలు గురించి మనకు తెలిసిందే. ఇవి కాకుండా, సినిమాలో చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. అందులో ఎంత వాస్తవికత ఉందనేది వాళ్లకే తెలియాలి.
కథ గురించి చెప్పుకునే ముందు పాత్రల గురించి మాట్లాడుకుందాం. ఇందులో నరేష్ పేరు నరేంద్ర. పవిత్ర లోకేష్ పేరు పార్వతి. ఇలా వాళ్ల నిజజీవిత పేర్లకు దగ్గరగానే స్క్రీన్ నేమ్స్ పెట్టారు. ఈ లెక్కన మిగతా పాత్రల్ని కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రమ్య రఘుపతి పాత్రను సౌమ్య సేతుపతిగా మార్చారు. కృష్ణ, విజయనిర్మల పాత్రలు యథాతథంగా ఉన్నాయి. అయితే ఎక్కువగా సూపర్ స్టార్ అని, సూపర్ స్టార్ భార్య అని మాత్రమే చెప్పారు.
ఇక కథ విషయానికొస్తే హీరో నరేంద్రకు అప్పటికే 2 పెళ్లిళ్లు అవుతాయి. ఆ రెండు పెళ్లిళ్లతో ఆయనకు మనఃశాంతి దొరకదు. ముచ్చటగా మూడోసారి సౌమ్య సేతుపతి (వనిత విజయ్ కుమార్)ను చేసుకుంటాడు. కానీ ఆ పెళ్లితో కూడా ఆయన కోరుకున్న సంతోషం దక్కదు. ఇలాంటి టైమ్ లో సినిమా సెట్స్ లో పార్వతి పరిచయమౌతుంది. మెల్లగా పార్వతివైపు ఆకర్షితుడౌతాడు నరేంద్ర. పార్వతికి కూడా వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులుంటాయి. ఆమె కాపురం కూడా కలహాలమయం. దీంతో ఆమె కూడా నరేంద్ర వైపు ఎట్రాక్ట్ అవుతుంది. అయితే ఓ హీరోతో డేటింగ్ చేస్తే మీడియా ముందు ఇబ్బంది పడాల్సి వస్తుందనేది ఆమె భయం. తమ పాత భాగస్వాముల్ని వదిలేసి కలిసి జీవించడానికి వాళ్లు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారనేది ఈ సినిమా స్టోరీ.
తన నిజజీవితంలో జరిగిన, జరుగుతున్న ఘటనలతో ఈ సినిమాను నిర్మించాడు నరేష్. అతడిచ్చిన ఇన్ పుట్స్ ఆధారంగా ఎమ్మెస్ రాజు ఈ కథను రాసి, డైరక్ట్ చేసిన విషయం ఈజీగా అర్థమౌతుంది. అయితే ఈ కథను ఎపిసోడ్స్ వారీగా చెప్పి, తన టాలెంట్ చూపించారు రాజు. ఇలా ఎపిసోడ్స్ గా చెప్పడం బాగుంది. ఒక డ్రామాగా చెబితే అంతగా ఎక్కి ఉండేది కాదేమో. ఇక స్క్రీన్ ప్లే విషయానికొస్తే.. సినిమా స్టార్ట్ అవ్వడం ఆసక్తికరంగా మొదలవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగా సెట్ అయింది. ఇప్పటివరకు తెలిసిన, చూసిన ఘటనలే కాబట్టి.. పైగా నరేష్-పవిత్రలకు చెందిన సన్నివేశాలే కాబట్టి.. ప్రేక్షకుడు ఈజీగానే కథలో లీనమయ్యాడు.
అయితే కొన్ని బోరింగ్ సన్నివేశాలు సినిమా ఫీల్ ను దెబ్బతీశాయి. పార్వతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను అంత సాగదీయాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఆ ఎపిసోడ్ తో ప్రేక్షకుడు పెద్దగా కనెక్ట్ అవ్వడు కూడా. ఇక సెకండాఫ్ లో మొదలైన బ్యాక్ స్టోరీతో చాలా టైమ్ వేస్ట్ చేశారు. మరికొన్ని సన్నివేశాలు కూడా చాలా నిదానంగా సాగి ఓపికను పరీక్షిస్తాయి. అప్పటికే ఎడిటింగ్ లో ఈ సినిమా 130 నిమిషాలకు చేరుకుంది. ఇంకా తగ్గిస్తే, 2 గంటల్లోపే నిడివి వస్తుందని భయపడి అలా వదిలేసినట్టున్నాడు ఎడిటర్.
నరేష్ తన సీనియారిటీ చూపించాడు. నిజజీవిత పాత్ర అయినప్పటికీ, దానికి మెలోడ్రామా అద్దడంలో నరేష్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. పవిత్ర కూడా కుదురుగా చేశారు. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆమె బాధలు చూడ్డానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇక నరేష్-పవిత్ర కాంబినేషన్ సీన్లు అయితే సూపర్. రియల్ లైఫ్ జంట కావడంతో, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరింది. ఇక ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మూడో వ్యక్తి వనిత విజయ్ కుమార్. ఆమె పాత్ర టోటల్ సినిమాకే హైలెట్. వనిత విజయ్ కుమార్ చాలా బాగా నటించింది.
అయితే ఈ సినిమా ఎంత మందికి నచ్చుతుందనేది చెప్పలేం. ఎఁదుకుంటే, వివాహేతర సంబంధాన్ని అందంగా చూపించే ప్రయత్నం జరిగింది ఇందులో. దాన్ని కుటుంబ ప్రేక్షకులు అంగీకరించకపోవచ్చు. అసలు ఈ సినిమా కథే, అలాంటి ప్రేక్షకులకు మింగుడుపడదు. ఇక నరేష్-పవిత్ర వ్యక్తిగత జీవితంపై ఆసక్తి లేని వాళ్లకు కూడా ఈ సినిమా నచ్చకపోవచ్చు. ఎందుకంటే, కేవలం ఓ సినిమాగా ఓపెన్ మైండ్ తో వెళ్లి దీన్ని చూడలేం. నరేష్-పవిత్రలను ఊహించుకొనే థియేటర్లలోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది. వీళ్ల లివ్-ఇన్ పై పెద్దగా ఇంట్రెస్ట్ లేనివాళ్లకు సినిమా నచ్చదు.
టెక్నికల్ గా సినిమా బాగుంది. ఎమ్మెస్ రాజు డైరక్షన్ బాగుంది. కొన్ని సెన్సిబుల్ సన్నివేశాల్లో ఆయన దర్శకత్వ ప్రతిభ కనిపిస్తుంది. ఇకనైనా ఆయన ఓటీటీ సినిమాల్ని వదిలేసి, మంచి ఎమోషనల్ సబ్జెక్టుల్ని ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. సురేష్ బొబ్బిలి అందించిన పాటల్లో 2 బాగున్నాయి. ఇక అరుల్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుంది. బాల్ రెడ్డి కెమెరా పనితనం అడుగడుగునా కనిపించింది. నరేష్, తన సొంత బ్యానర్ పై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించాడు.
ఓవరాల్ గా చూసుకుంటే.. ఆకర్షణగా మొదలైన ఎఫైర్, పార్వతితో నరేంద్ర ఎందుకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు? ఆమెకు ఎందుకు అండగా నిలవాలని ప్రయత్నించాడనే పాయింట్ బాగుంది. ఎంఎస్ రాజు సినిమాను తెరకెక్కించిన విధానం.. వనితా విజయ్ కుమార్, నరేష్, పవిత్ర పెర్ఫార్మెన్స్ కోసం మళ్లీ పెళ్లి సినిమాను ఓసారి చూడొచ్చు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు నరేష్-పవిత్రల రియల్ లైఫ్ సహజీననంపై ఎక్కువ ఆసక్తి కనబరిచేవారు ఎవరైనా ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.