ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో వైభవంగా నిర్వహించనున్నది. జూలై 7,8,9 తేదీల్లో జరిగే ఈ మహాసభల్లో పాల్గొనేందుకు, రాజకీయ, సినీరంగ ప్రముఖులతో పాటు సాహితీవేత్తలు, కవులు, ఇతర కళాకారులు, పారిశ్రామికవేత్తలు, మ్యూజిక్ డైరెక్టర్లు హాజరవుతున్నారు.
ఈ మహాసభలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ కన్వీనర్ రవి పొట్లూరి, కాన్ఫరెన్స్ చైర్మన్ శ్రీనివాస్ లావు కృషి చేస్తున్నారు. ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు అతిధులు ఫిలడెల్ఫియాకు వచ్చారు.
ఈ మహాసభలకు ముఖ్య అతిధిగా నందమూరి బాలకృష్ణ హాజరవుతున్నారు. సంగీత రారాజు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఈ మహాసభల్లో సంగీత కచేరి చేయనున్నారు. ప్రముఖ నేపథ్యగాయని చిత్ర తన గానంతో అందరినీ పరవశులను చేయనున్నారు.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో అందరిని మంత్రముగ్ధులను చేయనున్నాడు. భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పలువురు ఎంపీలు ఈ మహాసభలకు హాజరుకానున్నారు. శ్రీలల లాంటి హీరోయిన్లు ఇప్పటికే చేరుకోగా.. మిగతా ప్రముఖులంతా మరికొద్ది గంటల్లో మహాసభల్లో మెరవనున్నారు.