చిరంజీవి కొత్త సినిమాకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు విన్న కథలన్నీ ఆయన పక్కపెట్టారు, కమిట్ మెంట్స్ అన్నీ సైడ్ చేశారు. ఇప్పుడు పూర్తిగా ఒకే ఒక సినిమాపై దృష్టి పెట్టారు. అదే కల్యాణ్ కృష్ణ సినిమా. గతంలో బంగార్రాజు, సోగ్గాడే చిన్ని నాయన లాంటి సినిమాలు తీసిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు చిరంజీవి. దీనికి బెజవాడ ప్రసన్నకుమార్ కథ అందించాడు.
ఈ సినిమాపై ప్రస్తుతం చిరంజీవి వర్కవుట్ చేస్తున్నారు. దీనిపై చిరంజీవి ఇంత ఫోకస్ పెట్టడానికి ఓ ప్రత్యేకమైన రీజన్ ఉంది. చిరంజీవి కూతురు సుష్మిత ఈ సినిమాకు నిర్మాత. ఆమె ఇప్పటికే గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ అనే బ్యానర్ స్థాపించిన సంగతి తెలిసిందే. ముందుగా వెబ్ సిరీస్ తీశారు. ఆ తర్వాత శ్రీదేవి శోభన్ బాబు అనే చిన్న సినిమా తీశారు.
ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమాను పట్టాలపైకి తీసుకొస్తున్నారు. ఈ సినిమాతో కూతుర్ని నిర్మాతగా నిలబెట్టాలనేది చిరంజీవి ఆశ. అందుకే ఈ సినిమాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. భోళాశంకర్ షూటింగ్ ముగిసిన వెంటనే కూతురు నిర్మాతగా కొత్త సినిమా మొదలవుతుంది. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర కథనం కూడా వినిపిస్తోంది. కథ ప్రకారం ఇందులో మరో హీరోకు చోటుంది. ఆ పాత్రను సిద్ధు జొన్నలగడ్డతో చేయించాలని అనుకుంటున్నారట. అతడి సరసన హీరోయిన్ గా శ్రీలీలను తీసుకునే ఆలోచనలో ఉన్నారు.
చిరంజీవికి హీరోయిన్ ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం భోళాశంకర్ సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఆ మూవీ పూర్తయిన వెంటనే, కూతురు నిర్మాతగా, కల్యాణకృష్ణ దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే కొత్త ఆఫీస్ తెరిచింది సుశ్మిత. ప్రస్తుతం అందులోనే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది.