యంగ్ హీరోలతో సమానంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. ఈ వయసులో కూడా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఇప్పటికే వరుసపెట్టి సినిమాలు చేస్తున్న చిరంజీవి, త్వరలోనే మరిన్ని సినిమాలు ప్రకటించబోతున్నారు. ఇందులో భాగంగా ఆయన కథలు వింటున్నారు. మిత్రన్ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేసే అవకాశం ఉంది. చిరు తనయ సుశ్మిత ఈ సినిమాను నిర్మించే ఛాన్స్ ఉంది. ఈ సినిమాతో పాటు.. బింబిసార దర్శకుడు వశిష్ఠ తో కూడా కథాచర్చల్లో ఉన్నారు చిరంజీవి. ఈ ఇద్దరు దర్శకులతో పాటు, లిస్ట్ లో పూరి జగన్నాధ్ పేరు కూడా వినిపిస్తోంది.
నిజానికి ఈ సినిమాల కంటే ముందు వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయాల్సి ఉంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఆచార్య ఫ్లాప్ తర్వాత చిరంజీవి తన లైనప్ లో మార్పుచేర్పులు చేశారు. అందులో భాగంగా వెంకీ కుడుముల సినిమా సైడ్ అయింది.
ఇక పూరి జగన్నాధ్ కు మెగా ఛాన్స్ వస్తుందా రాదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చిరు-పూరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. గాడ్ ఫాదర్ సినిమాతో ఇద్దరి మధ్య అనుబంధం మరింత పెరిగింది. ఎప్పటికైనా అన్నయ్య కోసం స్టోరీ రెడీ చేస్తానని పూరి ప్రకటించిన సంగతి తెలిసింది.
ప్రస్తుతం లైమ్ లైట్లో ఉన్న మిత్రన్, వశిష్ట మాత్రం ముందు వరుసలో ఉన్నారు. వీళ్లలో ఒకరి సినిమాను చిరంజీవి అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో భోళాశంకర్ ను పూర్తిచేస్తారు మెగాస్టార్.