నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు షాక్‌: నో షేరింగ్‌

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ షేరింగ్ విధానాన్ని భారత్‌లో నిలిపివేసినట్లు ప్రకటించింది. ఎవరైతే నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటారో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే ఇకపై తమ సేవలు వినియోగించుకోగలుగుతారని తెలిపింది. ఈ విషయాన్ని పేర్కొంటూ తన యూజర్లకు మెయిల్స్ పంపింది. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్టేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్‌తో పాటు 100కు పైగా దేశాల్లో షేరింగ్‌ను అనుమతించమని గతంలోనే పేర్కొన్న ఈ సంస్థ ఇప్పుడు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

అయితే పాస్‌వర్డ్‌ షేర్‌ చేసుకోవాలనుకుంటే అదనంగా కొంత ఛార్జీ చెల్లించి వినియోగించుకోవాలని నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి పాస్‌వర్డ్‌ షేర్ చేసినందుకు యూజర్లకు ఛార్జీ విధించనున్నట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా భారత్‌లో ‘యాడ్‌ ఏ హోమ్‌’ ఫీచర్‌‌ను తీసుకురానుంది.

కాగా, చందాదారుల కుటుంబ సభ్యులు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, ప్రయాణ సమయంలో కూడా ఓటీటీ సదుపాయం పొందవచ్చని కంపెనీ చెప్పింది. ప్రొఫైల్‌ను బదిలీ చేయటం, మేనేజ్‌ యాక్సెస్ అండ్ డివైజస్ వంటి కొత్త ఫీచర్ల సాయంతో ఓటీటీ ప్రయోజనాలను పొందవచ్చని వెల్లడించింది. ఈ సదుపాయాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా ఈ ఓటీటీ దిగ్గజం తన ఫ్లాట్‌ఫాం ద్వారా పంచుకుంది. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో మొత్తం 23కోట్ల 80లక్షల సబ్‌స్క్రైబర్లుతో 1.5 బిలియన్ల లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ పేర్కొంది.

Related posts

నెలలో 38 లక్షల పెళ్లిళ్లు.. రూ.4.74 లక్షల కోట్ల వ్యాపారం

ఈ ఫీచర్‌తో మీ చాటింగ్ ఎవరూ చదవలేరు

RBI – రూ.1000 నోట్లు మళ్లీ వస్తున్నాయా?