భారత్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యంకానీ ఘనత సాధించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. రోవర్ ప్రగ్యాన్ జాబిల్లిపై పరుగులు పెట్టింది. అయితే చంద్రయాన్-3తో దిగ్విజయాన్నిఅందుకున్న ఇస్రో తర్వాత చేపట్టే మిషన్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భవిష్యత్‌లో ఇస్రో చేసే ప్రాజెక్ట్‌ల గురించి చూద్దాం.
ఆదిత్య ఎల్1
సూర్యుడు గుట్టు విప్పడం కోసం ‘ఆదిత్య ఎల్1’ను ఇస్రో ప్రయోగించనుంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలోనే PSLV C56 రాకెట్‌తో నింగిలోకి దూసుకెళ్తుంది. సూర్యుడు-భూమికి నడుమ అయిన లాగ్రేంజ్ పాయింట్ వద్ద ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. సౌరతుఫాన్ల సమయంలో సౌర వాతావరణం ఎలా ఉంటుందో అధ్యయనం చేయనుంది. సూర్యుడిపై పరిశోధనలకు రోదసిలో తొలి భారతీయ అబ్జర్వేటరీగా ఈ వ్యోమనౌక పనిచేస్తుంది.
గగన్‌యాన్
భారతదేశం చేపట్టబోయే తొలి మానవ స్పేస్ మిషన్ గగన్‌యాన్. భూమికి 400 కిలోమీటర్ల కక్ష్యలోకి ముగ్గురు వ్యోమగాములను పంపి, 3 రోజుల తర్వాత వారిని సురక్షితంగా భూమికి తీసుకురావడమే దీని లక్ష్యం. అయితే, తొలి రెండు గగన్యాన్లు (G1, G2) మానవరహిత మిషన్లు. మూడోది H1.. మానవసహిత మిషన్. వాస్తవానికి 2022లోనే దీన్ని చేపట్టాల్సి ఉంది. కానీ కొవిడ్ సహా పలు కారణాలతో వాయిదా పడింది. వచ్చే ఏడాది గగన్‌యాన్‌ను చేపట్టనున్నారు.
భారత్-అమెరికా నిసార్
ఇస్రో, నాసా కలిసి సంయుక్తంగా చేపడుతున్న దిగువ భూకక్ష్య అబ్జర్వేటరీ మిషన్ నిసార్. భూమిని నిరంతరం పరిశీలిస్తూ ప్రతి 12 రోజులకొకసారి భూమిని మ్యాప్ చేస్తుంది. సముద్ర మట్టాలు, భూగర్భ జలం సహా భూవాతావరణానికి సంబంధించిన అనేక కీలక వివరాలను ఈ ఉపగ్రహం అందజేయనుంది. సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇది దోహదపడనుంది. 2024 జనవరిలో ఈ ప్రాజెక్టు చేపట్టనుంది.
శుక్రయాన్
అంగారకుడు కక్ష్యలో ఆర్బిటర్‌ను పంపినట్లే శుక్రుడి వద్దకు కూడా వ్యోమనౌకను పంపాలనే లక్ష్యంతో ‘శుక్రయాన్-1’ ప్రాజెక్టుకు ఇస్రో ప్రణాళికలు రచిస్తోంది. 2024 చివర్లో ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉంది. ఒకవేళ అప్పటికీ సాధ్యం కాకపోతే 2026 లేదా 2028లో చేపట్టే అవకాశం ఉంది. శుక్ర గ్రహాన్ని భూమికి కవల సోదరిగా భావిస్తారు. చాలా అంశాల్లో ఈ రెండు గ్రహాల మధ్య సారూప్యతలు ఉన్నాయి.
మంగళయాన్ 2
మంగళయాన్ 1 ద్వారా ఇప్పటికే కుజుడి కక్ష్యలో మామ్ (మార్స్ ఆర్బిటర్ మిషన్)ను ఇస్రో ప్రవేశపెట్టింది. వచ్చే ఏడాది మంగళయాన్-2 ప్రాజెక్టు చేపట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. అయితే మళ్లీ ఆర్బిటర్‌ను పంపాలా లేక ల్యాండింగ్‌కు ప్రయత్నించాలా అన్నదానిపై అగ్ర శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రయాన్-4
చంద్రయాన్-4ను భారత్ జపాన్‌తో కలిసి చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు దాదాపుగా ఒక కొలిక్కి కూడా వచ్చాయి. దీనికి చంద్రయాన్-4 లేదా లుపెక్స్ (లూనార్ పోలార్ ఎక్స్‌ప్లొరేషన్ మిషన్) అని కూడా పేరు పెట్టే అవకాశం ఉంది. మరో మూడు నాలుగు ఏళ్లలో ఈ ప్రాజెక్టును ప్రయోగించే అవకాశం ఉంది.