భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు (Vanama Venkateshwara Rao) సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అనర్హతపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. 15 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా, వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ గత నెల 25న తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఆస్తులు, కేసుల వివరాలను పొందుపొరచలేదని, తప్పుడు వివరాలతో వాస్తవాలను దాచి ఎన్నికల అఫిడవిట్ సమర్పించినందుకు వనమా వెంకటేశ్వరరావుపై అనర్హుడిగా ప్రకటించింది. అంతేగాక ఆయనకు రూ.5 లక్షల జరిమానా విధించింది, ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది. దీంతో వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ చేపట్టి హైకోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
కాగా, 2018 సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా పోటీ చేయగా టిఆర్ఎస్ (బిఆర్ఎస్) అభ్యర్థిగా జలగం వెంకట్రావు పోటీ చేశారు. జలగంపై వనమా నాలుగు వేల ఓట్లకు పైగా తేడాతో విజయం సాధించి తర్వాత బిఆర్ఎస్ లో చేరారు.