తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీస్తున్నాయి. ”సనాతన ధర్మం ఓ వ్యాధి లాంటిది. సామాజిక సమానత్వానికి అది విరుద్ధం. ప్రజలను కులాల పేరిట విభజించింది. దీన్ని నిర్మూలించాలి” అంటూ శనివారం ఆయన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శనివారం ‘సనాతన నిర్మూలన’ అనే ఇతివృత్తంతో సదస్సు నిర్వహించింది. దీనికి హాజరైన ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే ఉదయనిధి వ్యాఖ్యలపై భాజపా సహా, హిందూ సంఘాలు విరుచుకుపడుతున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. తమిళనాడులో కొంత మంది నిజస్వరూపం ఇప్పుడు బయటపడుతోందని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం శాశ్వతమైనదని, ఇలాంటి రాజకీయపరమైన వ్యాఖ్యల వల్ల దానికి ఏమీ జరగబోదని అన్నారు. భాజపా నేత అమిత్ మాల్వియా కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న 80 శాతం జనాభా మారణహోమానికి ఉదయనిధి పిలుపునిచ్చారని అన్నారు. కాంగ్రెస్కు డీఎంకే చాలాకాలంగా మిత్ర పక్షంగా ఉంటోందని, ఇండియా కూటమి సమావేశంలో ఇదే నిర్ణయించిందా అని ప్రశ్నించారు.
మరోవైపు ఉదయనిధి స్టాలిన్ తన మాటలను సమర్థించుకున్నారు. మారణహోమానికి తానేమి పిలుపునివ్వలేదని, బలహీన వర్గాల పక్షాన మాట్లాడినట్లు చెప్పారు. తన వ్యాఖ్యలపై ఎలాంటి న్యాయపరమైన సవాలుకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ అనుచరులమని, సామాజిక న్యాయాన్ని నిలబెట్టడానికి, సమానత్వ సమాజాన్ని స్థాపించడానికి ఎప్పటికీ పోరాడుతామని వెల్లడించారు.