స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల పతాకాన్ని ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన దిగువ, మధ్య తరగతి ప్రజలకు శుభవార్త తెలిపారు. వారికి పట్టణ ప్రాంతాల్లో సొంతింటి కల సాకారానికి కొత్త పథకాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చేలా ఈ పథకం ఉండనున్నట్లు వెల్లడించారు.
అలాగే సంప్రదాయ కళాకారులకు చేయూతనందించేందుకు ‘విశ్వకర్మ యోజన’ పేరుతో నూతన పథకాన్ని తీసుకురాబోతున్నట్లు మోదీ తెలిపారు. వచ్చే నెల నుంచే ఈ పథకం ప్రారంభించనున్నట్లు, తొలి విడతగా రూ.15వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా జన ఔషధి కేంద్రాల సంఖ్యను కూడా పెంచుతున్నట్లు ప్రకటించారు. జనరిక్ మందులు అందరికీ అందుబాటులో ఉండేందుకు కేంద్రాల సంఖ్యను 10వేల నుంచి 25వేలకు పెంచుతున్నట్లు చెప్పారు.
తమ పనితీరును మెచ్చి 2019 ఎన్నికల్లో అవకాశం ఇచ్చారని, మరోసారి ఆశ్వీరదిస్తే వచ్చే ఆగస్టు 15న మళ్లీ వస్తానని ప్రధాని మోదీ అన్నారు. దేశం అభివృద్ధి పథంలో పయనించేందుకు వచ్చే ఐదేళ్లు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చానని, ప్రజల కోసమే ఆలోచిస్తానని, వారే నా కుటుంబమని తెలిపారు. అవినీతి, వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయని, వాటిని నమూలంగా నిర్మూలించాలని వెల్లడించారు.