పల్నాడు జిల్లాలో జరిగిన ఓ విషాదకర ఘటన అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. కొన్ని గంటల వ్యవధిలోనే భార్య ప్రసవించిన ఆస్పత్రికి భర్త విగత జీవిలా వచ్చాడు. వివరాల్లోకి వెళ్లే.. కారంపూడికి చెందిన రామాంజిని అనే మహిళకు శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. రాత్రి 10 గంటలకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్య సదుపాయాలు సరిగాలేవని అక్కడ వైద్యులు గురజాల ప్రభుత్వాస్పత్రికి వెళ్లమని సూచించారు. దాంతో గురజాల ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ కూడా వైద్య సదుపాయాలు సరిగా లేవని సమాధానం రావడంతో.. 70 కి.మీ. దూరంలో ఉన్న నరసారావుపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. నరసరావుపేట ఆస్పత్రి వద్దకు చేరగానే రామాంజిని ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
మరోవైపు కారంపూడి నుంచి గురజాల వరకు తోడుగా వచ్చిన ఆమె భర్త ఆనంద్ (40).. ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తానని బయలుదేరాడు. బైక్‌పై ఇంటికి వెళ్లి తిరిగొస్తుండగా మార్గమధ్యంలో జోలకల్లు వద్ద రహదారిపై ఉన్న పెద్ద గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు ఆనంద్‌ను నరసరావుపేటలో తన భార్య ఉన్న ఆసుపత్రికే తరలించారు. అయితే తన బిడ్డను చూడాటానికి వస్తాడనుకున్న ఆనంద్ విగత జీవిగా ఆసుపత్రితో కనిపించడంతో.. కుటుంబ సభ్యులంతా గుండెలవిసేలా రోదించారు.