కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గృహపయోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై (LPG cylinder) రూ.200 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో మంగళవారం జరిగిన కేంద్ర కేబినేట్‌లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రక్షా బంధన్ కానుకగా ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. తగ్గించిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు. దీంతో సుమారు 33 కోట్ల మంది వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. అలాగే ఉజ్వల పథకం కింద కొత్తగా మరో 75 లక్షల కొత్త వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఏటా 12 గ్యాస్ సిలిండర్లపై రూ.200 చొప్పున సబ్సిడీ ఉంటుంది. ఇప్పుడు మరో రూ.200 తగ్గించడంతో వీరికి రూ. 400 సబ్సిడీ వర్తించినట్లయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను ఇటీలవ పలుమార్లు సవరించారు. కానీ గృహపయోగ సిలిండర్ ధరను మాత్రం స్థిరంగా ఉంచారు. చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో సిలిండర్‌పై మరో రూ.50 పెంచారు. కాగా, అయిదు రాష్ట్రాల్లో రానున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.