తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ మూవీకి రూట్ క్లియర్ అయ్యింది. రిలీజ్ డేట్ ప్రకారం అక్టోబర్ 19వ తేదీనే తెలుగు వెర్షన్ ‘లియో’ రిలీజ్ కానుంది. అంతకుముందు లియో టైటిల్ విషయంలో ఓ వ్యక్తి పిటిషన్ వేయగా దీనిపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. వాదనల అనంతరం ఈనెల 20 వరకు తెలుగులో విడుదలను నిలిపివేస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. అయితే దీనిపై నాగవంశీ స్పందించారు. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించి క్లారిటీ ఇచ్చాడు. లియో సినిమా టైటిల్ విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, అదే పేరుతో తెలుగులో వేరేవరో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అన్నాడు. అయితే వారు తమకు సమాచారం ఇవ్వకుండా నేరుగా కోర్టును ఆశ్రయించారని తెలిపాడు. తర్వాత వారితో చర్చించి ఈ సినిమాని 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని, విడుదల తేదీలో మార్పు ఉండదని చెప్పాడు. టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆయనకు, తమకు నష్టం జరగకుండా చూసుకుంటామని అన్నాడు.
అయితే లియో మూవీ ఇప్పటికే టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టించింది. విడుదలకు రెండు రోజుల ముందే ఓవర్సీస్లో వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. ఇక కనగరాజ్-విజయ్‌ల కాంబోలో రానున్న ఈ సినిమాకు అంచనాలు భారీగా ఉన్నాయి.