mp medak
Home » Kotha Prabhakar Reddy-బీఆర్‌ఎస్‌ ఎంపీపై కత్తితో దాడి

Kotha Prabhakar Reddy-బీఆర్‌ఎస్‌ ఎంపీపై కత్తితో దాడి

by admin
0 comment

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇంటింటి ప్రచారం నేపథ్యంలో పాస్టర్‌ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వస్తుండగా ఎంపీపై సోమవారం దాడి జరిగింది. ఆయనకు పొట్ట పైభాగంలో గాయాలయ్యాయి. కరచాలనం చేసేందుకు వచ్చిన ‘రాజు’ అనే వ్యక్తి ఉన్నట్టుండి తన వెంట తెచ్చిన కత్తితో ఒక్కసారిగా ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేశాడు. మిరుదొడ్డి మండలం పెద్దప్యాల గ్రామానికి చెందిన వ్యక్తిగా నిందితుడిని గుర్తించారు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో విలేకరిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దాడి జరగగానే అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు రాజును పట్టుకొని చితకబాదారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

మరోవైపు దాడి అనంతరం కొత్త ప్రభాకర్ రెడ్డిని కార్యకర్తలు గజ్వేల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం హైదరాబాద్‌‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. పొట్టలోకి కత్తి మూడు అంగుళాలు దిగినట్లు వైద్యులు గుర్తించారు. కాసేపట్లో శస్త్రచికిత్స చేయనున్నారు. కాగా, నారాయణఖేడ్ సభకు వెళ్తుండగా మంత్రి హరీశ్ రావుకు సమాచారం అందడంతో ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

ఘటనపై గవర్నర్‌ దిగ్భ్రాంతి
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తితో దాడి చేసిన అంశంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఈ దాడి ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై తగిన విధంగా చర్యలు తీసుకోవాలని డీజీపీకి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. ప్రచారం చేసే సమయంలో అభ్యర్థులు భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం శాంతియుత వాతావరణాన్ని ఉండేలా చూడటం చాలా అవసరమని అన్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links