శ్రీలంక స్పిన్ ఉచ్చులో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. బ్యాటింగ్‌కు అంత సులువుకానీ పిచ్‌పై 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ (53; 48 బంతుల్లో) అర్ధశతకం సాధించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం లభించింది. 11 ఓవర్లకు 80/0తో ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించింది. దీంతో మరోసారి భారత్ భారీస్కోరు సాధిస్తుందని భావించారంతా. కానీ తర్వాత సీన్ మారిపోయింది. లంక స్పిన్నర్లు సత్తాచాటి స్కోరును కట్టడిచేశారు. పది వికెట్లు స్పిన్నర్లే పడగొట్టారు. వెల్లలాగే (5/40) ఓపెనర్లను, గత మ్యాచ్ సెంచరీ హీరోలు విరాట్ కోహ్లి (3), కేఎల్ రాహుల్ (39)తో పాటు హార్దిక్ పాండ్య (5)ను బోల్తా కొట్టించాడు. అసలంక (4/18) నాలుగు, తీక్షణ ఒక్క వికెట్ పడగొట్టారు.
భారత్ 91/3తో నిలిచిన సమయంలో క్రీజులోకి వచ్చిన రాహుల్ ఇషాన్ కిషాన్(33)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. కానీ లంక బౌలర్లు మరోసారి బంతిని తిప్పుతూ టీమిండియాను ఇబ్బంది పెట్టారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (26) పరుగులు చేయడంతో భారత్ 200 మార్క్‌ను దాటింది. అయితే ఛేదనలో ‘తేమ’ ప్రభావం చూపకపోతే టీమిండియా బౌలర్లను ఎదుర్కోవడం లంకకు అంత ఈజీ కాదు.