దేవరగట్టు.. ఈ పేరు వినగానే విజయదశమి రోజున ఓ వైబ్రేషన్. కొండగట్టు ప్రాంతమైన దేవరగట్టు చుట్టూ ఉన్న గ్రామాల మధ్య అర్ధరాత్రి జరిగే కర్రల సమరాన్నే ఈ ప్రాంతంలో బన్ని ఉత్సవంగా పిలుస్తారు. రెండు వర్గాలుగా గ్రామస్తులు విడిపోయి కర్రలతో కొట్టుకుంటారు. ఇదేదో ప్రత్యర్థులపై చేసే దాడి కాదు. స్వామివారిని దక్కించుకునే సంప్రదాయ సమరమే దేవరగట్టు కర్రల యుద్ధం.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని హొళగుందా మండలంలో ఉంది దేవరగట్టు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు.. పొరుగున ఉన్న కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఈ కర్రల సమరానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏటా మాలమల్లేశ్వరుడి కల్యాణం నిర్వహించిన తర్వాత గ్రామస్థులు కర్రలతో యుద్ధం చేస్తారు. ఒకవైపు మూడు గ్రామాల వారు ఉంటే.. మరో వైపు ఆరు గ్రామల జనం కాచుకుని ఉంటారు.
ఈ కర్రల సమరం ఉద్దేశం దేవతా మూర్తులను కాపాడుకోవడం. విగ్రహాలను తమ అధీనంలో ఉంచుకోవాలని ఒక వర్గం, ఆ విగ్రహాలను దక్కించుకోవాలని మరో వర్గం చేసే పోరాటమే కర్రల యుద్ధం. కర్రలతో కొట్టుకోవడం, తలలు పగిలి రక్తం చిందిచడం తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ సమరం ముగియగానే నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి వినిస్తారు. మరుసటి రోజు నెరణికి గ్రామ పురోహితులు స్వామివారికి అర్చనలు చేస్తారు. ఆ తర్వాత రథోత్సవం ఉంటుంది. గొరవయ్యల ఆటలు, నోటితో గొలుసు తెంపటం, దేవదాసీల క్రీడోత్సవం, వసంతోత్సవం, కంకణ విసర్జన విన్యాసాలు ఈ ఉత్సవంలో మరో ప్రత్యేకత. చివరకు మాలమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి.
బన్ని ఉత్సవానికి 1000 మంది పోలీసులతో భద్రత కల్పించారు. ప్రతిష్టాత్మకంగా జరిగే దేవరగట్టు బన్ని ఉత్సవం ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బన్ని ఉత్సవానికి పోలీసులతో పటిష్ట భద్రత కల్పించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి, అల్లర్లు, నిప్పులు విసరడం వంటివి సృష్టిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. 100 నైట్ విజన్ సిసి కెమెరాలు, 600 ఎల్ఈడి లైట్లు, డ్రోన్ కెమెరా, విడియో కెమెరాల ను వినియోగిస్తున్నారు. దేవరగట్టు చేరుకునే రహదారుల్లో బందోబస్తు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.