ఒక్క పూట భోజనం చేయకపోతే చాలామందికి కడుపు మండిపోతుంది, కొంతమందికి తలనొప్పి కూడా వచ్చేస్తుంది. 2 పూటలు భోజనం లేకపోతే ఇక చెప్పేదేముంది. కానీ ఇరాన్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం 17 ఏళ్లుగా భోజనం చేయడం లేదు. అతడి పొట్టలోకి ఘన పదార్థం వెళ్లి దాదాపు 17 ఏళ్లు అవుతోంది.
ఇరాన్ కు చెందిన ఘోలమరెజా ఆర్డెస్, భోజనం చేయడు. కేవలం శీతల పానీయాలతో తన కడుపు నింపుకుంటాడు. అలా ఒక ఏడాది, రెండేళ్లు కాదు.. ఏకంగా 17 ఏళ్ల నుంచి అతడు చేస్తున్నది ఇదే. దీనికి కారణం అతడికి ఆకలి వేయకపోవడమే.
2006 నుంచి ఆర్డెస్ కు ఆకలి తగ్గిపోయింది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు, కానీ ఆకలి వేయడం లేదు. అయినప్పటికీ బలవంతంగా కొన్ని రోజులు తినే ప్రయత్నం చేశాడు. ఇక ఆ ఏడాది జూన్ లో తినడం మానేశాడు. కేవలం పెప్సీ, కోకోకోలా లాంటి శీతల పానీయాలు మాత్రమే తాగుతున్నాడు.
ఓ మానసిక సమస్యతో బాధపడుతున్నాడు ఆర్డెస్. అతడికి నోటిలో ఏదో ఉందనే ఫీలింగ్ ఎక్కువ. జుట్టు లాంటి పదార్థం ఏదో కడుపులో పుట్టుకొచ్చి, అది నోటి వరకు వ్యాపించి ఉందనే భ్రమలో ఉండిపోయాడు. దీన్నుంచి బయటపడేందుకు అతడు చాలామంది వైద్యుల్ని కూడా కలిశాడు. కానీ అతడి ఫీలింగ్ మారలేదు.
దీంతో ప్రస్తుతం అతడు వైద్యుల్ని కలవడం మానేశాడు. కూల్ డ్రింక్స్ కు పనిచెప్పాడు. కాస్త నీరసంగా అనిపించిన ప్రతిసారి కూల్ డ్రింక్ తాగుతాడు. అలా రోజుకు 3 లీటర్ల కూల్ డ్రింక్ తో కడుపు నింపుకుంటున్నాడు ఈ వ్యక్తి. 17 ఏళ్ల నుంచి ఇదే అతడి ఆహారం.