Home » StarBucks – కొత్త యాడ్ తో సరికొత్త తలనొప్పులు

StarBucks – కొత్త యాడ్ తో సరికొత్త తలనొప్పులు

by admin
0 comment

కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందంటారు! స్టార్ బక్స్ కంపెనీ పరిస్థితి ఇప్పుడు ఇండియాలో అలాగే తయారైంది. యాడ్ ద్వారా కొత్త కస్టమర్లను సంపాదించుకోవటం అటుంచీ ఉన్నవార్ని కూడా పొగొట్టుకునే స్థితిలో చిక్కుకుంది. ట్విట్టర్ లో ‘బాయ్ కాట్ స్టార్ బక్స్’ అంటూ చాలా మంది నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇంతకీ, కొంత మంది ఇండియన్స్ కి అంతగా కోపం తెప్పించిన న్యూ స్టార్ బక్స్ యాడ్ దేని గురించి? అర్పితాగా మారిన అర్పిత్ కాస్తా… స్టార్ బక్స్ గిరాకీని ఆర్పేస్తున్నాడు! అదీ సంగతి…

రకరకాల ఫ్లేవర్లలో కాఫీలు అమ్ముకునే స్టార్ బక్స్ బ్రాండ్ కి, అర్పితాగా మారిన అర్పిత్ కి సంబంధం ఏంటంటే… తాజాగా విడుదలైన ఒక కమర్షియల్ వీడియోనే. అందులో జెండర్ ఛేంజ్ చేసుకుని కూతురుగా తండ్రి ముందుకొచ్చిన మాజీ కొడుకుని… సదరు డాడీ ఎలా రిసీవ్ చేసుకున్నాడన్నది చూపించారు. ‘ఇట్ స్టార్ట్స్ విత్ యువర్ నేమ్’ అనే ట్యాగ్ లైన్ తో స్టార్ బక్స్ ఈ క్యాంపైన్ మొదలు పెట్టింది. అయితే, చాలా మందికి అర్థం కాని విషయం ఇక్కడ ఒకటుంది. జనాలకి కాఫీ అమ్ముకోటానికి, ఈ విధంగా జెండర్ ఛేంజ్ అంశాన్ని గొప్పగా చిత్రీకరించటానికి… ఉన్న సంబంధం ఏంటి? అది స్టార్ బక్స్ కోసం యాడ్ తయారు చేసిన క్రియేటివ్ టీమ్ కే తెలియాలి. కాకపోతే, అర్పితాగా మారిపోయిన అర్పిత్ ఇప్పుడు సొషల్ మీడియాలో చిన్న సైజు దుమారమే రేపుతున్నాడు.

యాడ్ నచ్చిన వాళ్లు సహజంగానే ‘వావ్, గ్రేట్…’ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. మగవారిగా ఫీలయ్యే ఆడవారికి, ఆడవారిగా భావించుకునే మగవారికి తప్పకుండా గౌరవం, ప్రేమా పంచాలంటూ హితబోధలు చేస్తున్నారు. కానీ, యాడ్ నచ్చని వారు మాత్రం ‘‘ఇండియాలో కాఫీలు అమ్ముకోటానికి వచ్చిన పాశాత్య ఎమ్మెన్సీలు మాకు అభ్యుదయవాదం నేర్పక్కర్లేదు. అవసరం అయినప్పుడు ఏం చేయాలో మేం చేసుకుంటాం. మీరు కాఫీలు సర్వ్ చేస్తే చాలు’’ అని చురకలు వేస్తున్నారు. మరి కొందరైతే బాయ్ కాట్ స్టార్ బక్స్ అంటూ ఇతర ప్రత్యామ్నాయాల్ని కూడా తెర మీదకు తెస్తున్నారు. ఇక మీదట కాఫీ కోసం స్టార్ బక్స్ మేం వెళ్లమంటూ శపథాలు చేస్తున్నారు. మరికొందరైతే ఇంకాస్త వెటకారం దట్టించి… ‘‘వెస్ట్రన్ దేశాల్లోని వోక్ కల్చర్ ఇండియాకు తీసుకురావటం స్టార్ బక్స్ పని కాదు. మీరు కాఫీలు అమ్మండి చాలు. ఉచిత సలహాలు అమ్మకండి’’ అంటున్నారు.

సొషల్ మీడియాలో రైట్ వింగ్, హిందూత్వవాదులు మరో కోణంలోనూ యాడ్ ను తప్పుబడుతున్నారు. అర్పితాగా మారిన అర్పిత్ అంటూ హిందూ పేర్లతో హడావిడి చేస్తోన్న స్టార్ బక్స్… ఇతర మతాల్లోని పేర్లను ఇలాగే వాడగలదా అంటూ వేలెత్తి చూపుతున్నారు.

ఇప్పుడు స్టార్ బక్స్ గొడవే కాదు… గత కొంత కాలంగా పలు కమర్షియల్ యాడ్స్ వివాదాస్పదం అవుతున్నాయి. ఆ మధ్య తనిష్క్ ఇలాగే ముస్లిమ్, హిందూ మతాంతర వివాహాన్ని తమ ప్రచార చిత్రంలో చూపించి ట్రోలింగ్ ఎదుర్కొంది. హిందూ అమ్మాయి సీమంతం ముస్లిమ్ కుటుంబంలోని అత్తమామలు చేసినట్టు చూపించారు. దాని వల్ల అప్పట్లో బోలెడంత నెగటివ్ పబ్లిసిటీ లభించింది తనిష్క్ జ్యుయవెలర్స్ కు. బాయ్ కాట్ పిలుపులు కూడా వినిపించాయి. స్టాక్ మార్కెట్లోనూ సదరు నగల కంపెనీకి చుక్కలు కనిపించాయి.

అయినా కూడా జనాల్ని ఆకర్షించే యాడ్స్ పైన కాకుండా కంపెనీలు భారీ సందేశాలు ఇవ్వటానికి తహతహలాడుతున్నాయి. ఇప్పుడు స్టార్ బక్స్ కూడా యూత్ ను, ఫ్యామిలీస్ ను అట్రాక్ట్ చేయకుండా… జెండర్ మార్చుకున్న వారికి గౌరవం, ప్రేమ పంచండి అంటూ అనవసర రిస్క్ తీసుకుంది. చూడాలి మరి, బాయ్ కాట్ స్టార్ బక్స్ ఆన్ లైన్ ఉద్యమం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో…

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links