జైపుర్ ఎక్స్‌ప్రెస్ (Jaipur Express) రైలులో దారుణం జరిగింది. రాజస్థాన్‌లోని జైపుర్ నుంచి ముంబయి వెళ్తున్న రైలులో సోమవారం ఉదయం ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్పీఎఫ్ ఏఎస్సైతో పాటు ముగ్గురు ప్రయాణికులు మరణించారు. రైలు మహారాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్ దాటి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
”జైపుర్ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. మొదటగా సీనియర్ అధికారి ఏఎస్సై టికా రామ్ మీనాను కాల్చి చంపాడు. తర్వాత మరో బోగీలోకి వెళ్లి ముగ్గురు ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. దాంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైలు పాల్ఘర్ స్టేషన్ దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది” అని ఆర్పీఎఫ్ అధికారులు వెల్లడించారు. అయితే కాల్పుల అనంతరం దహిసర్ స్టేషన్ వద్ద నిందితుడు రైలు నుంచి దూకేశాడు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
షార్ట్ టెంపరే కారణం
ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ ప్రవర్తనే జైపుర్ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల ఘటనకు కారణమైందని ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (వెస్టర్న్ రైల్వే) ప్రవీణ్ సిన్హా వెల్లడించారు. చేతన్‌కు షార్ట్ టెంపర్ అని, ఆ సమయంలో పెద్ద గొడవేం జరగలేదని తెలిపారు. కానీ అతడు క్షణికావేశంతో తన సీనియర్‌ను కాల్చివేశాడని, తర్వాత కనిపించిన వారిని కాల్చుకుంటూ పోయాడని పేర్కొన్నారు. అయితే తాను మానసికంగా వేధింపులకు గురయ్యాయని చేతన్ కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం.