లంచం తీసుకుంటూ ఓ అధికారి లోకాయుక్త అధికారులకు చిక్కాడు. ఎలా అయినా
వారి నుంచి తప్పించుకోవాలని ఒక్కసారిగా నోట్లను మింగేశాడు. దీనికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని కట్నీ నగరంలో సోమవారం జరిగింది.
వివరాళ్లోకి వెళ్తే.. కట్నీ నగరంలో రెవెన్యూ విభాగంలో గజేంద్ర సింగ్ పనిచేస్తున్నాడు. పని నిమిత్తం అతడి వద్దకు వచ్చిన ఓ వ్యక్తిని రూ.5 వేలు లంచం అడిగాడు. దాంతో ఆ వ్యక్తి లోకాయుక్త అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన అధికారులు గజేంద్ర సింగ్ను లంచం తీసుకునేప్పుడు పట్టుకునేలా ప్లాన్ చేశారు.
ఆ వ్యక్తి నుంచి గజేంద్ర రూ.5వేలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాంతో ఏం చేయాలో తెలియక ఆ రెవెన్యూ అధికారి ఒక్కసారిగా నోట్లని మింగేశాడు. అతడి ప్రవర్తన చూసి అధికారులు షాక్ అయ్యారు. అనంతరం అతడ్ని ఆసుపత్రికి తరలించారు. అతడికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.