తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, శ్రీముఖి తదితరులు..
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: డడ్లీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
కథా పర్యవేక్షణ: సత్యానంద్
డైలాగ్స్: తిరుపతి మామిడాల
రన్ టైమ్: 2 గంటల 39 నిమిషాలు
రేటింగ్: 2/5
2015లో వచ్చింది వేదాళం సినిమా. దానికి రీమేక్ గా 2023లో వచ్చింది భోళాశంకర్ సినిమా. మరి 8 ఏళ్ల గ్యాప్ లో వచ్చిన ఈ కథ, ఇప్పటి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందా? చిరంజీవి మేజిక్ ఈ సినిమాకు పనిచేసిందా? న్యూస్360 తెలుగు ఎక్స్ క్లూజివ్ రివ్యూ
కథ
శంకర్ (చిరంజీవి) తన చెల్లి మహాలక్ష్మి (కీర్తి సురేష్)తో కలిసి కోలకతాకి వస్తాడు. బ్రతుకుతెరువు కోసం టాక్సీ నడుపుతూ ఉంటాడు. అయితే, సిటీలో ఓ మాఫియా గ్యాంగ్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి అరబ్ షేక్ లకు అమ్మేస్తూ ఉంటారు. వారిని పట్టుకోలేక పోలీసులు సతమతమవుతూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో శంకర్ (చిరంజీవి) ఆ మాఫియాని టార్గెట్ చేస్తాడు. అసలు శంకర్ ఆ మాఫియాని ఎందుకు టార్గెట్ చేశాడు?, గతంలో ఆ మాఫియాతో శంకర్ కి ఉన్న సంబంధం ఏమిటి? ఈ మధ్యలో లాయర్ లాస్య(తమన్నా)తో శంకర్ ట్రాక్ ఏమిటి? చివరకు శంకర్ ఆ మాఫియాని అంతం చేశాడా లేదా ? అనేది బ్యాలెన్స్ కథ.
నటీనటుల పనితీరు
చిరంజీవి ఈ సినిమాకు సెంటరాఫ్ ఎట్రాక్షన్. ఆయన కామెడీ టైమింగ్ అదుర్స్. లుక్స్ పరంగా కూడా ఈసారి చిరంజీవి మెప్పించారు. అయితే డాన్స్ లో మాత్రం చిరు సిగ్నేచర్ స్టెప్స్ పెద్దగా కనిపించలేదు. ఈ సినిమాకు వన్ అండ్ ఓన్లీ ఎట్రాక్షన్ చిరంజీవి. చిరు ప్రేయసిగా తమన్నా ఆకట్టుకుంది. అయితే ఆమెలో మునుపటి గ్లామర్ కనిపించలేదు. ఇక చిరు చెల్లెలిగా కీర్తిసురేష్ బాగా సూట్ అయింది. చిరంజీవి తర్వాత కీలకమైన పాత్ర ఆమెదే. వెన్నెల కిషోర్, రఘుబాబు, శ్రీమఖి, జబర్దస్ట్ టీమ్, అంతా తమ పాత్రల మేరకు నటించారు.
టెక్నీషియన్స్ పనితీరు
సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఖర్చుకు వెనకాడకుండా సినిమాను తెరకెక్కించారు నిర్మాత అనీల్ సుంకర. ఇక డడ్లీ సినిమాటోగ్రఫీ మరో ఎట్రాక్షన్. మహతి స్వరసాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది, 2 పాటలు ఆకట్టుకున్నాయి. అయితే సాంగ్స్ ప్లేస్ మెంట్ మాత్రం కుదర్లేదు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాగాలేదు. కనీసం ఓ 10 నిమిషాలైనా కట్ చేసి ఉండొచ్చు. ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్ బాగున్నాయి.
న్యూస్360 తెలుగు రివ్యూ
వేదాళం సినిమాకు రీమేక్ గా వచ్చింది భోళాశంకర్ సినిమా. వేదాళం 2015లో రిలీజైంది. భోళాశంకర్ ఈరోజు వచ్చింది. ఈ రెండు సినిమాల్ని చూసిన వాళ్లకు ఈ 8 ఏళ్లలో సినిమా ఎంత మారిందో అర్థమౌతుంది. కొత్త కథలు, స్క్రీన్ ప్లే ఎంత అవసరమో తెలిసొస్తుంది. 8 ఏళ్ల నాటి ఈ తమిళ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనే మూర్ఖత్వం. ఈ రీమేక్ లో నటించడానికి చిరంజీవి ఎలా ఒప్పుకున్నారో, నిర్మించడానికి నిర్మాతలు ఎలా అఁగీకరించారో ఎంత ఆలోచించినా అర్థం కాదు.
విషయానికి వస్తే, “భోలా శంకర్” సాధారణ ప్రేక్షకులను, ఆయన అభిమానులకు తీవ్రంగా నిరాశపరుస్తుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఏదోలా అనిపిస్తుంది. ఎక్కడా కనెక్ట్ అవ్వం. కామెడీ వస్తుంటుంది కానీ నవ్వు రాదు. సెంటిమెంట్ సీన్ వస్తుంది కానీ హార్ట్ కు టచ్ అవ్వదు. ఇక సాంగ్స్ వస్తే చిరంజీవి స్టెప్స్ చూడాలనిపించదు. అదేంటో సినిమా మొత్తం భారంగా నడుస్తుంది. సెల్ ఫోన్ చూసుకోవాలనిపిస్తుంది. ఉన్నంతలో చిరంజీవి తన నటనతో సినిమాను కాపాడే ప్రయత్నం చేశారు. లేదంటే, ఇది మెహర్ రమేశ్ కెరీర్ లో మరో ‘శక్తి’ అయ్యేది.
కథనం, దర్శకత్వం, సంగీతం, డైలాగ్‌లు, ఫైట్లు.. ఇలా ఏవీ ఈ సినిమాలో వర్కవుట్ అవ్వలేదు. ఏవీ పని చేయవు. ఇవన్నీ ఒకెత్తయితే.. ఖుషి నడుము సీన్ మరో ప్రహసనం. చిరంజీవి-శ్రీముఖి మధ్య తీసిన ఈ సీన్ చూడ్డానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అది ఫన్ కోసం తీశారా, పవన్ కల్యాణ్ పరువు తీయడానికి తీశారో అర్థం కాదు.
పరిశ్రమలో చిరంజీవి లెజెండ్. అలాంటి హీరోను పెట్టి, ఎదురుగా శ్రీముఖిని కూర్చోబెట్టి ఇలాంటి నాసిరసం సన్నివేశాలు తీయడం మెహర్ రమేష్ కే చెల్లింది. దయచేసి భవిష్యత్తులో ఇలాంటి అనుకరణలు, చీప్ సన్నివేశాల్లో నటించొద్దని చిరంజీవికి ఎవరైనా గట్టిగా చెబితే బాగుణ్ను. ఇలా కామెడీ కోసం చిరంజీవి చేసిన ప్రయత్నాలేవీ వర్కవుట్ కాలేదు. సీన్ లో దమ్ము లేనప్పుడు చిరంజీవి అయినా ఏం చేస్తారు పాపం. ఇక కీర్తి సురేష్‌తో ఎమోషనల్ సీన్స్ కూడా రొటీన్‌గా ఉన్నాయి. క్లయిమాక్స్ లో కొన్ని సీన్లు మాత్రం వర్కవుట్ అయ్యాయి.
నటనపరంగా చిరంజీవి ఎప్పటిలాగే తనదైన శైలిలో మెప్పించారు. కీర్తి సురేష్ సరైన ఎంపిక. ఆమె బాగా చేసింది. తమన్నా బాగానే ఉంది. ఇతర నటీనటులు కేవలం కనిపిస్తారంతే. జబర్దస్త్ టీమ్ అయితే ఎందుకుందో అర్థంకాదు. మహతి స్వర సాగర్ పాటలు కనెక్ట్ అవ్వవు. దర్శకుడిగా మెహర్ రమేష్ మరోసారి మెప్పించలేకపోయాడు. స్క్రీన్ ప్లే దారుణంగా ఉంది.
ఓవరాల్ గా భోళాశంకర్ సినిమా చిరంజీవి కెరీర్ లో రాంగ్ ఛాయిస్ గా నిలుస్తుంది. అతడి స్టార్ డమ్ ఈ సినిమాను కాపాడలేదు. అసలు ఈ సినిమాను ఎందుకు చూడాలనే ప్రశ్నకు ఒక్క సాలిడ్ ఆన్సర్ కూడా కనిపించట్లేదు.
బాటమ్ లైన్ – బోర్ కొట్టించిన భోళా
– Written by Ravi Tungala