మాటలకందని విషాదం. కలలో కూడా ఊహించని ప్రమాదం. ఒరిస్సాలో జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 278కి చేరింది. అటు క్షతగాత్రుల సంఖ్య వెయ్యి దాటింది. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సమీపంలోని హాస్పిటల్స్ లో వీళ్లకు చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..
స్థానిక అధికారుల కథనం ప్రకారం- బెంగుళూరు నుంచి పశ్చిమ బెంగాల్లోని హౌరాకు వెళ్తున్న బెంగుళూరు- హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్ పై పడిపోయాయి. వాటిని షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. దాంతో కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి.
ఈ ప్రమాదం అక్కడితో అయిపోలేదు. బోల్తాపడ్డ కోరమండల్ కోచ్ లను పక్కనున్న ట్రాక్ పై నుంచి దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. ప్రమాదానికి గురైన సమయంలో కోరమండల్ ఎక్స్ ప్రెస్. కోల్ కతా నుంచి చెన్నైకి వెళ్తుంది.
అయితే ఇది అధికారిక ప్రకటన కాదు. దీనిపై విభిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపిన తర్వాత, ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని రైల్వే శాఖ వెల్లడిస్తుంది.