train
Home » Vizianagaram Train accident- ఘోర రైలు ప్రమాదం

Vizianagaram Train accident- ఘోర రైలు ప్రమాదం

by admin
0 comment

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలును వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ (08504) రైలు ఢీకొట్టింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది మరణించారు. 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో రాయగడ రైల్లోని బోగీలు నుజ్జునుజ్జు కాగా, మరికొన్ని పట్టాలు తప్పాయి. అయితే అక్కడే మరో ట్రాక్‌పైనున్న గూడ్సు రైలు బోగీలపైకి అవి దూసుకెళ్లడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఈ ఘోరప్రమాదం చోటు చేసుకుంది.

సిగ్నల్‌ కోసం పలాస ప్యాసింజర్‌ పట్టాలపై నెమ్మదిగా వెళుతూ ట్రాక్‌పై నిలవగా, ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన రాయగడ రైలు ఢీకొట్టింది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన బాలేశ్వర్‌ రైలు ప్రమాద సంఘటన మాదిరిగానే ఈ ప్యాసింజర్‌ రైళ్ల ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, పలాస, రాయగడ ప్యాసింజర్‌ రైళ్లలో సుమారు 1400 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులతో ఉన్న బోగీలు అదుపుతప్పడం, రెండుగా అవి చీలిపోయి నుజ్జునుజ్జవ్వడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

రైలు ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను మోదీ ప్రకటించారు. మరోవైపు రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంలో మృతిచెందిన ఏపీకి చెందినవారి కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఇతర రాష్ట్రాలవారు మరణిస్తే రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను ఇవాళ ఆయన పరామర్శించనున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links