242
తెరపై జంటగా కనిపించి మురిపించిన వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి.. నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంట వివాహ వేడుక ఇటలీలోని టస్కానీలో ఈనెల 1న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి విందు కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వరుణ్-లావణ్యల కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక కోలాహలంగా జరిగింది. సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై.. కొత్త దంపతుల్ని ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. దాదాపు ఆరేళ్లు ప్రేమలో ఉన్న వరుణ్, లావణ్య పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరు కలిసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో నటించారు. ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే వారి మధ్య ప్రేమ పుట్టింది.