history
Home » Chandrayaan-3: ప్రపంచమే ఎదురుచూస్తోంది.. అసలు సవాలు ఇప్పుడే!

Chandrayaan-3: ప్రపంచమే ఎదురుచూస్తోంది.. అసలు సవాలు ఇప్పుడే!

by admin
0 comment

140 కోట్ల మంది భారతీయులే కాదు, ఇప్పుడు ప్రపంచమంతా భారత్‌ వైపే చూస్తుంది. అతిక్లిష్టమైన ల్యాండింగ్‌ సవాలును ఇస్రో ఎలా ఎదుర్కొంటుందని సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. ఇప్పటివరకు చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ఏ దేశ వ్యోమనౌక అడుగుపెట్టలేకపోయింది. నాలుగేళ్ల క్రితం ప్రయత్నించిన చంద్రయాన్‌-2 కూడా ఆఖరి అడుగులోనే విఫలమైంది. ఇటీవల రష్యా వ్యోమనౌక లూనా-25 ల్యాండర్‌ కూలిపోవడంతో ఇక భారత్‌పైనే అందరి ఆశలు ఉన్నాయి.

చంద్రునిపై ప్రయోగాలు అయిదు దశాబ్దాల క్రితమే మొదలయ్యాయి. ఆ సమయంలో అమెరికా, రష్యా తీవ్రంగా పోటీపడ్డాయి. అంతరిక్ష రంగంలో పైచేయి తమదేనని నిరూపించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఇతర దేశాల సహకారం తీసుకోవడానికైనా, అందించడానికైనా అన్ని దేశాలు సిద్ధంగా ఉన్నాయి. మానవాళికి ఉపయోగపడే ప్రయోగాలు సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నాయి. అందుకే భారత్‌ చరిత్ర సాధించాలని ప్రపంచమే ఆశిస్తోంది.

ల్యాండింగ్‌ సవాలు ఎందుకు?
జాబిల్లిపై గురుత్వాకర్షణ ఉండదు. దీంతో ల్యాండింగ్‌ సమస్య సాధారణంగానే ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఇక మనకు కనిపించని చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌ అంటే అత్యంత కఠిన సవాలే. గతంలో ప్రయోగించిన చంద్రయాన్‌-2 ల్యాండింగ్‌ సమయంలోనే విఫలమైంది. చివరి పావుగంట ల్యాండింగ్‌ను ‘15 మినట్స్‌ టెర్రర్‌’గా ఇస్రో అధికారులు పోల్చారు. మునపటి ల్యాండర్‌ను సెకనుకు రెండు మీటర్ల వేగాన్ని తట్టుకునేలా రూపొందించారు. అయితే జాబిల్లి ఉపరితలంపై దిగే క్రమంలో ల్యాండర్‌ వేగాన్ని అంచనా వేయడంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తి ఆ ల్యాండర్‌ విఫలమైంది.

కానీ ఈ సారి ల్యాండర్‌ సెకనుకు మూడు మీటర్ల వేగాన్ని తట్టుకునేలా రూపొందించారు. ఉపరితలాన్ని బలంగా తాకినా తట్టుకునేలా ల్యాండర్‌ కాళ్ల డిజైన్‌ను మార్చారు. తొలుత 500X500 మీటర్ల ప్రదేశంలో దిగడానికి ల్యాండర్‌ ప్రయత్నిస్తుంది. అక్కడ కుదరకపోతే 4X2.5 కి.మీల పరిధిలో ఎక్కడైనా దిగేలా ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను జోడించారు. హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవాయిడెన్స్‌ కెమెరాల సంఖ్యను రెండుకు పెంచారు.

ఇవి చంద్రయాన్‌-2లోని ఆర్బిటర్‌, మిషన్‌ కంట్రోల్‌తో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు దోహదపడేలా రూపొందించారు. దానికి తగ్గట్లుగానే ఇది విజయం సాధించినట్లు ఇస్రో సోమవారం ప్రకటించింది. ‘‘చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌తో చంద్రయాన్‌-3కి చెందిన ల్యాండర్‌ మాడ్యుల్‌ను విజయవంతంగా అనుసంధానం జరిగింది” అని తాజాగా ట్వీట్ కూడా చేసింది. దీంతో చంద్రయాన్‌-3 లక్ష్య దిశగానే దూసుకెళ్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

ఇక చందమామపై దిగేటప్పుడు ల్యాండర్‌ వేగాన్ని ఎప్పటికప్పుడు నిర్దిష్టంగా కొలిచేందుకు కొత్తగా అభివృద్ధి చేసిన లేజర్‌ డాప్లర్‌ వెలోసీమీటర్‌ అనే పరికరాన్ని చంద్రయాన్‌-3లో ఏర్పాటుచేశారు. టెస్ట్‌డేటా ఆధారంగా అల్గోరిథమ్‌లను తయారుచేశారు. చంద్రయాన్‌-2 నేర్పించిన పాఠాలతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సారి రూపొందించారు. దీంతో భారత్‌ చరిత్ర సృష్టించడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దానికోసం బుధవారం వరకు ఎదురుచూడాలి. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియ ఆగస్టు 23న సాయంత్రం 5:20 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 6.04 గంటలకు ముగుస్తుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links