Scam 2003 Review: డబ్బు సంపాదించను, సృష్టిస్తా- తెల్గీ

దేశాన్ని కుదిపేసిన స్టాంప్‌ పేపర్‌ కుంభకోణం ఆధారంగా తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌ ‘స్కామ్‌ 2023: ది తెల్గీ స్టోరీ’. ఈ సిరీస్‌ ఓటీటీ సోనీలివ్‌లో శుక్రవారం విడుదలైంది. 2003లో స్టాంప్‌ పేపర్‌ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ కథను తెర మీద చూపించారు. ‘స్కామ్‌ 1992’ను చిత్రీకరించిన హన్సల్ మెహతా ఈ సిరీస్‌ను నిర్మించారు. తుశార్ హిరానందిని దర్శకత్వం వహించారు. స్టూడియో నెక్ట్స్ భాగస్వామ్యంతో అప్లాజ్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ ఈ సిరీస్‍ను నిర్మించింది. అయితే రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన ఈ సిరీస్‌ అంచనాలను అందుకుందా?

కథేంటి.. కర్ణాటకలోని ఖానాపూర్‌కు చెందిన అబ్దుల్‌ కరీం తెల్గీ డిగ్రీ పట్టాదారుడు. ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని విఫలమే అవుతాయి. దాంతో రైళ్లలో పండ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అయితే కలివిడిగా మాట్లాడే అతడి తీరు ట్రైన్‌లో ప్రయాణించే షౌకత్‌ ఖాన్‌కు బాగా నచ్చుతుంది. ముంబయికు వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని తెల్గీకి మాటిస్తాడు. ఆర్థిక సమస్యలు తొలగాలంటే ముంబయికి వెళ్లడమే బెటర్‌ అని ఫిక్స్‌ అయ్యి తెల్గీ వెళ్తాడు. ఈ నిర్ణయమే అతడి జీవితాన్ని మార్చేస్తుంది. చిరిగిన బట్టలతో వెళ్లిన అతడు రూ.వేల కోట్ల స్టాంప్‌ పేపర్ల కుంభకోణాన్ని ఎలా చేస్తాడు? ఆ ప్రయాణంలో అతడికి సహకరించిందెవరు? తెలుసుకోవాలంటే వెబ్‌సిరీస్‌ చూడాలి.

వాస్తవ సంఘటనల ఆధారంగా వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించడమంటే కఠిన సవాలే. కానీ ఈ ఛాలెంజ్‌లో దర్శకుడు తుశార్ హిరానందిని గెలిచారని చెప్పొచ్చు. తెల్గీ కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేసిన తర్వాత వెంటనే అసలు కథ ప్రారంభమవుతుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగేలా సిరీస్‌ను తీశారు. ‘డబ్బు సంపాదించను, సృష్టిస్తా’ అనే ఆలోచన ఉన్న తెల్గీ దాని కోసం ఎలాంటి సాహసాలు చేశాడనేది చక్కగా చూపించారు. గల్ఫ్‌ దేశాల్లో ఎక్కువగా డబ్బు సంపాదించి తెల్గీ ఇండియాకు తిరిగొచ్చే సన్నివేశంతో కథ మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి మరింత వేగంగా సాగుతుంది.

నాసిక్‌లోని కర్మాగారంలో ప్రింట్‌ అయిన స్టాంప్‌ పేపర్లు దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడకు ఎలా ట్రాన్స్‌పోర్ట్‌ అవుతాయో తెల్గీ వివరించే క్రమంలో వచ్చే విజువల్స్‌ ఎంతో ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం వెబ్‌సిరీస్‌కు బలంగా మారింది. అయితే 5 ఎపిసోడ్లను సుమారు 50 నిమిషాల నిడివితో రూపొందించడంతో సాగదీతగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో లాజిక్‌ మిస్‌ అయిన భావన కూడా కలుగుతుంది. అందరి నటన బాగుంది. తెల్గీ పాత్ర చేసిన గగన్‌ దేవ్‌ రియార్‌.. క్యారెక్టర్‌లో జీవించాడనిపించేలా నటించాడు. సాంకేతిక బృందం పనితీరు చక్కగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం