special session of parliament- గతంలో ఇలా ఎన్నిసార్లు జరిగాయి, వాటి కారణాలేంటి?

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణయించడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సమావేశాలకు అజెండా ఏంటనే విషయాన్ని వెల్లడించకపోవడంతో మరింత ఉత్కంఠ నెలకొంది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించడానికని, జమిలి ఎన్నికల బిల్లు తీసుకురాబోతున్నారని, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు కోసమని, జి-20 శిఖరాగ్ర సదస్సు, చంద్రయాన్‌-3 విజయవంతం, ఓబీసీ వర్గీకరణకు జస్టిస్‌ రోహిణి కమిషన్‌ చేసిన సిఫార్సుల ఆమోదం వంటివి విషయాలపై చర్చించడానికని ఇలా వేర్వేరు వర్గాలు భిన్న అంచనాలు వేస్తున్నాయి.

అయితే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం ఇదేమి తొలిసారి కాదు. దేశ చరిత్రలో ఎన్నో సార్లు ప్రత్యేక సమావేశాలు జరిగాయి. దేశానికి స్వాతంత్య్రం సాధించుకున్న తరుణంలో ఆగస్టు 14, 15వ తేదీల్లో తొలిసారిగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. 1962 భారత్‌-చైనా యుద్ధ సమయంలోనూ స్పెషల్‌ సెషన్‌ నిర్వహించారు. సరిహద్దులో చైనా చొరబాటుపై సుదీర్ఘంగా చర్చించేందుకు అప్పటి ప్రధాని నెహ్రూ నేతృత్వంలో నవంబర్‌ 8, 9వ తేదీల్లో ప్రత్యేక సమావేశం జరిపారు.

భారతావని బానిస సంకెళ్ల తెంచుకొని 25 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో 1972 ఆగస్టు 15న మరోసారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే, స్వాతంత్ర్య పోరాట స్మృతులను గుర్తుచేసుకుంటూ.. ‘క్విట్ ఇండియా ఉద్యమం’ 50 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 1992 ఆగస్టు 9న అర్ధరాత్రి సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత 1997 ఆగస్టు 15న అర్ధరాత్రి స్పెషల్‌ సెషన్‌ జరిపారు. స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో ఇప్పటికీ రెండు సార్లు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరిగాయి. డా.BR అంబేద్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకుని 2015 నవంబర్‌ 26, 27 తేదీల్లో స్పెషల్ సెషన్‌ నిర్వహించారు. ఆ తర్వాత GST అమలు చేయడానికి 2017 జూన్‌ 30న ప్రత్యేకంగా అర్ధరాత్రి పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బిల్లుపై చర్చ జరిగిన తొలి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఇదే అవ్వడం విశేషం. గతంలో జరిగిన అన్ని స్పెషల్‌ సెషన్‌లు యుద్ధ సమస్య, చారిత్రక సంఘటనలను స్మరించుకోవడానికి మాత్రమే సమావేశమయ్యాయి. కాగా, ఈ సారి జరగనున్న ప్రత్యేక సమావేశాలు అయిదు రోజులు జరగనుండటం మరో ప్రత్యేకత.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం