విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తమకి కలిసొస్తుందని, గతంలో కూడా విజయం తెచ్చి పెట్టిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చపై మోదీ గురువారం సాయంత్రం మాట్లాడారు. విపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ మరోసారి తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
”విపక్షాలు ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాసం ఎప్పటికీ మాకు అదృష్టమే. మేం మరోసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి రావాలని విపక్షాలు నిర్ణయించాయి. అందుకే ఈ అవిశ్వాసం తీసుకొచ్చాయి. విపక్షాలకు ప్రజల ఆకలి గురించి పట్టింపు లేదు. అధికారంలోకి రావాలనే ఆకలితోనే ఉంది. అయితే ఈ తీర్మానంలో మరో విచిత్రం చోటుచేసుకుంది. ప్రతిపక్ష నాయకుడు అదీర్ రంజన్ చౌదరికి మాట్లాడే అవకాశం వాళ్ల పార్టీనే ఇవ్వలేదు. ఆయనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదో అర్థం కావడం లేదు. బహుశా కోల్‌కతా నుంచి కాల్ వచ్చిందేమో”
”దేశ ఉన్నతిని మేం మరింత ఎత్తుకు తీసుకెళ్తుంటే.. మరికొందరు మాత్రం దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రపంచమంతా భారతదేశం వైపు నమ్మకంగా చూస్తుంది. దేశాభివృద్ధిపైనే మా దృష్టి అంతా ఉంది. ప్రస్తుతం అదే అవసరం. యువతకు అవినీతి రహిత ప్రభుత్వం, అవకాశాలను అందించాం. వచ్చే అయిదేళ్లలో భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో దేశంగా నిలుస్తుంది.” అని మోదీ అన్నారు.