parl
Home » Parliament – 96 ఏళ్ల సేవలకు ఇక సెలవు!

Parliament – 96 ఏళ్ల సేవలకు ఇక సెలవు!

by admin
0 comment

96 ఏళ్ల పాటు సేవలందించిన పార్లమెంట్‌ ఇక చరిత్రగా మారనుంది. మంగళవారం నుంచి కొత్తభవనంలో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పార్లమెంట్‌ పాత భవనంతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్నో ఘట్టాలకు సాక్షిగా వీక్షించిన పార్లమెంట్‌ నిర్మాణాన్ని1927లో పూర్తిచేశారు. అప్పటి వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌ దీన్ని అట్టహాసంగా ప్రారంభించారు. అప్పట్లో దీన్ని ‘కౌన్సిల్‌ హౌస్‌’గా పిలిచారు. ఈ భవనాన్ని సర్‌ హెర్బెర్ట్‌ బేకర్‌, సర్‌ ఎడ్విన్‌ లుట్యెన్స్‌ డిజైన్‌ చేశారు.
బంగారు తాళం చెవులను బేకర్‌ అందజేయగా లార్డ్‌ ఇర్విన్‌ ఈ భవంతిని తెరచి, ప్రారంభించారు. వలసవాద పాలన, రెండో ప్రపంచ యుద్ధం, స్వాతంత్య్రం సిద్ధించడం, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన క్షణాలు, మరెన్నో ఘట్టాల స్మృతులకు ఈ భవనం నిలయంగా ఉంది. ఇక స్వతంత్ర భారత్‌లో పార్లమెంటుకు 75 ఏళ్ల ప్రస్థానం ఉంది.

కాగా, పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పాత భవనానికి వీడ్కోలు పలుకుతూ ప్రధాని మోదీ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు ”75 ఏళ్లలో ఈ భవనం చారిత్రక ఘట్టాలకు వేదికైంది. కొత్త భవనంలోకి వెళ్లినా ఈ భవనం మనకు నిరంతర ప్రేరణగా నిలుస్తుంది. భారత్‌ సువర్ణాధ్యాయానికి ఈ భవనం సాక్షి. భిన్నత్వానికి ప్రతీకైన ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ ఈ భవనం భాగస్వామ్యం కల్పించింది. దళితులు, ఆదివాసీలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలకు ఈ సభ అవకాశం కల్పించింది. ఈ భవనంలో పనిచేసిన ప్రతిఒక్కరినీ గుర్తించుకోవాల్సిన సమయమిది. ఇంద్రజీత్ గుప్తా 43 ఏళ్లపాటు ఈ సభలో సేవలు అందించి రికార్డు సృష్టించారు. 25 ఏళ్ల చంద్రమణి ముర్ము ఈ సభకు ఎన్నికైన అతిచిన్న వయస్కురాలు. 93 ఏళ్ల వయసులో కూడా షకీ ఉర్‌ రెహ్మాన్‌ ఈ సభకు సేవలందించారు.”

”నెహ్రూ నుంచి వాజ్‌పేయీ, మన్మోహన్‌ సింగ్‌ వరకు ఈ సభకు నేతృత్వం వహించారు. ప్రధానులుగా ఉన్నప్పుడే నెహ్రూ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీ దివంగతులయ్యారు. చర్చల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్ని ఉన్నా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా నిలిచాయి. మొరార్జీ దేశాయ్‌, వీపీసింగ్‌ జీవితకాలం కాంగ్రెస్‌లో ఉండి.. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. రాజకీయాలను విరమించుకుని సన్యాసం తీసుకోవాలనుకున్న పీవీ ప్రధానిగా దేశానికి కొత్త దిశానిర్దేశం చేశారు. ఈ పరిణామాలు భారత ప్రజాస్వామ్య విస్తృతికి నిదర్శనం” అని మోదీ అన్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links