ktr
Home » Modi-KTR: మోదీ వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఫైర్‌

Modi-KTR: మోదీ వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఫైర్‌

by admin
0 comment

పార్లమెంట్‌ ‘ప్రత్యేక’ సమావేశాలు (Parliament Session) సోమవారం ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) లోక్‌సభలో ప్రసంగించారు. పలు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న మోదీ ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని కూడా ప్రస్తావించారు. విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌లా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదని అన్నారు. వాజ్‌పేయీ హయాంలో మూడు రాష్ట్రాల విభజన ప్రణాళికాబద్ధంగా జరిగిందని, ఆ సమయంలో అన్ని చోట్లా సంబరాలు జరిగాయని తెలిపారు. కానీ, ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదని, ఏపీ, తెలంగాణ ఇరు వర్గాలనూ సంతృప్తిపర్చలేకపోయిందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందని, రాష్ట్ర ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయని, కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేకపోయిందని మోదీ వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. మోదీ తెలంగాణ విరోధి అని, తెలంగాణపై అక్కసు ఎందుకని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు. ”మోదీ…తెలంగాణ విరోధి. తెలంగాణ మీద పదే పదే అదే అక్కసు ఎందుకు ప్రధాని..? అమృతకాల సమావేశాలని పేరుపెట్టి విషం చిమ్మడం ఏం సంస్కారం? తెలంగాణ అంటేనే గిట్టనట్టు..పగబట్టినట్టు మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా? తల్లిని చంపి బిడ్డను తీసారని అజ్ఞానం, అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారు? పద్నాలుగేళ్లు పోరాడి, దేశాన్ని ఒప్పించి మెప్పించి సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం? ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని మా ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారు? వడ్లు కొనండని అడిగితే నూకలు తినమని మా రైతుల్ని కించపర్చారు మీ కేంద్రమంత్రి. ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తదా.. మీలాగే మీ మంత్రులు ఉన్నారు. మూటలు ఎట్లాగూ మా రాష్ట్రానికి ఇవ్వరు. కనీసం మాటల్లోనైనా మర్యాద చూపించండి”

”కోటి ఆశలు, ఆకాంక్షలతో పురుడుపోసుకొన్న కొత్త రాష్ట్రానికి సహకరించక పోగా, ఆది నుంచి కక్షను పెంచుకొని వివక్షనే చూపిస్తున్నారు. ఏడు మండలాలు గుంజుకొని, లోయర్ సీలేరు ప్రాజెక్టును లాక్కొని పురిట్లోనే మీరు చేసిన తొలిద్రోహాన్ని మర్చిపోం. నీతి ఆయోగ్‌ చెప్పినా నీతిలేకుండా మిషన్ కాకతీయ, భగీరథలకు నిధులను నిరాకరించిన మీ నిర్వాకాన్ని ఏమనాలి? కృష్ణాలో నీటి వాటాలు తేల్చకుండా పదేళ్లుగా దక్షిణ తెలంగాణ రైతుల్ని దగాచేస్తున్న మీ పగను ఎట్లా అర్థంచేసుకోవాలి? కాజీపేట కోచ్‌ ఫాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయి దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని క్షమించగలమా? 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి ఇవ్వకుండా గుండుసున్నా చేసారంటే .. మీకు తెలంగాణపై ఎంత కోపమో కదా!”

”పైన అప్పర్ భద్ర, కింద పోలవరం.. ఇంకెక్కడో కెన్‌బెత్వాకు జాతీయహోదాఇచ్చి మధ్యలో తెలంగాణకు మొండిచేయి ఎందుకు? మేం చేసిన పాపమేంది? బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఉరేసి, గిరిజన వర్సిటీ పెట్టకుండా నానబెట్టి ఆదివాసులపై కక్షసాధిస్తున్నారు ఎందుకు? సింగరేణి బొగ్గుబావుల్ని వేలం వేస్తారు. ఐటీఐఆర్‌ను రద్దు చేస్తారు.హైదరాబాద్‌కు ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే ఓర్వలేరు,
మీరు నిధులివ్వరు. సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే ఆంక్షలు విధిస్తారు. అడుగడుగునా దగా, ప్రశ్నిస్తే పగ, జుమ్లా..హమ్లా డబుల్ ఇంజన్‌ సర్కారు మీది! ఈడీ, ఐటీ, సీబీఐలను మీ ఎన్డీయే కూటమిలో చేర్చుకొని.. ప్రతిపక్షాలపై ఉసిగొల్పి ప్రభుత్వాలను
పడగొట్టడమే పనిగా పెట్టుకున్న మీకు.. పొద్దున లేచి ప్రజాస్వామ్య సుద్దులు చెప్పడం విచిత్రం. డబుల్ ఇంజన్‌ నినాదంతో ఊదరగొట్టే మీకు తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావు. డిపాజిట్లు పోగొట్టుకోవడంలో మీరు మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా” అని ట్వీట్‌ చేశారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links