రాష్ట్రంలో కలకలం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీప్తి మృతి కేసులో ఊహించని మలుపు తిరిగింది. దీప్తి అనుమానస్పద మృతి తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆమె సోదరి చందన పేరిట ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఇంట్లో మద్యం సేవించామని, కానీ అక్కను చంపలేదంటూ తన సోదరుడు సాయికి చందన వాయిస్ మెసేజ్ పంపింది. ఈ మెసేజ్‌తో మృతికి సంబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చాయి. అలాగే మిస్టరీగా మారిన ఈ కేసులో పోస్టు మార్టం నివేదిక కీలకంగా మారింది.
అసలేం జరిగిందంటే.. జగిత్యాలలోని కోరుట్ల పరిధిలోని భీమునిదుబ్బలో బంక శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులు నివాసముంటున్నారు. వీరికి దీప్తి(24), చందన, సాయి సంతానం. దీప్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా ఏడాదిన్నర క్రితం చేరారు. ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేస్తున్నారు. చందన బీటెక్ పూర్తి చేసి, ఇంటి వద్దే ఉంటున్నారు. కుమారుడు సాయి బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడు. బంధువుల గృహప్రవేశం ఉండటంతో ఆదివారం శ్రీనివాస్‌రెడ్డి, మాధవి హైదరాబాద్‌కు వెళ్లారు. సోమవారం రాత్రి 10 గంటలకు వారిద్దరూ కుమార్తెలతో ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం ఫోన్ చేయగా దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చందన ఫోన్ స్విచ్‌ఆఫ్ వచ్చింది. వెంటనే ఇంటి ముందున్న వారికి సమాచారమిచ్చారు. వారు ఇంటికి వచ్చి చూడగా దీప్తి మృతి చెంది ఉంది.
స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా డీఎస్పీ రవీందర్‌రెడ్డి, కోరుట్ల, మెట్‌పల్లి సీఐలు ప్రవీణ్‌కుమార్, లక్ష్మీనారాయణ, ఎస్సై కిరణ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీప్తి మృతదేహం సోఫాలో పడి ఉండగా, వంట గదిలో రెండు మద్యం సీసాలు, కూల్‌డ్రింక్ బాటిల్, తినుబండారాల ప్యాకెట్లు కనిపించాయి. చందన ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఆమె, ఓ యువకుడుతో కలిసి సోమవారం ఉదయం నిజామాబాద్ వెళ్లే బస్సులో ఎక్కినట్లు రికార్డు అయింది. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
అయితే దీప్తి మృతదేహానికి కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. చేయి, ఛాతి, చెంప భాగంలో గాయాలున్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో హత్యేనేని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. కానీ చందన మిస్సింగ్ గురించి దర్యాప్తు కొనసాగిస్తుండగా ఆమె ఆడియో మెసేజ్ చర్చనీయాంశంగా మారింది. మెసేజ్‌లో.. చందన తన స్నేహితుడితో మద్యం సీసాలను ఇంటికి తెప్పించిందని చెప్పింది. అయితే ఇంట్లో నుంచి తాను వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాని, ఈ విషయాన్ని తన అక్కకు చెప్పడానికి ప్రయత్నించానని వివరించింది. కానీ దీప్తి మద్యం తాగి సోఫాలో పడుకుందని, డిస్టర్బ్ చేయొద్దని అక్కడ నుంచి వెళ్లిపోయానని తెలిపింది. కానీ తాను అక్కను చంపలేదని మెసేజ్‌లో తమ్ముడు సాయికి చెప్పింది.