భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద చరిత్రాత్మక విజయం సాధించాడు. ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించాడు. దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానాను బోల్తాకొట్టించి ఫైనల్‌కు చేరాడు. తుదిపోరులో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో పోటీపడనున్నాడు. టైటిల్ పోరులో భాగంగా మంగళవారం తొలి గేమ్ జరుగుతుంది.
సెమీస్‌లో 18 ఏళ్ల ప్రజ్ఞానంద 3.5-2.5 తేడాతో కరువానాపై నెగ్గాడు. ఈ విజయంతో 2024 క్యాండిడేట్ టోర్నీలో చోటు ఖాయం చేసుకున్నాడు. బాబి ఫిషర్, కార్ల్‌సన్ తర్వాత ఆ పోటీల్లో తలపడే మూడో పిన్న వయస్సు ఆటగాడిగా ప్రజ్ఞానంద నిలిచాడు. అంతే కాకుండా 2005లో ప్రపంచకప్‌లో నాకౌట్ ఫార్మాట్ ప్రవేశపెట్టిన తర్వాత ఫైనల్ చేరిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర లిఖించాడు. అంతకుముందు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగిన ప్రపంచకప్‌ల్లో ఆనంద్ 2000, 2002లో టైటిల్ నెగ్గాడు.