ప్రాణం పోయే స్థితిలో కూడా 13 ఏళ్ల కీర్తన చూపిన తెగువకు అందరూ సెల్యూట్ చేస్తున్నారు. చుట్టూ చీకటి ఉన్నా, భయం వెంటాడుతున్నా, కళ్లెదుటే తల్లి, చెల్లి గోదావరిలో కొట్టుకుపోతున్నా.. ఆ బాలిక సమయస్ఫూర్తిగా వ్యవహరించి తన ప్రాణాలను కాపాడుకుంది. చేయి జారితే ప్రాణం పోతుందని తెలిసి కూడా.. ఒంటిచేత్తో పైపును పట్టుకొని, మరోచేత్తో ఫోన్ను తీసి పోలీసులకు కాల్ చేసింది. తన ధైర్యానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కీర్తన తల్లి సుహాసినిది గుంటూరు జిల్లా తాడేపల్లి. గత కొన్నాళ్లుగా ఆమె భర్తతో విభేదించి కూలిపని చేసుకుంటూ కీర్తనతో కలిసి ఉంటోంది. అయితే సుహాసినికి రెండేళ్ల క్రితం ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేష్ పరిచయమయ్యాడు. అనంతరం అతడితో సహజీవనం కొనసాగిస్తున్న క్రమంలో ఏడాది కిందట ఆమెకు పాప జన్మించింది. తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో.. సుహాసినితో పాటు ఇద్దరు కూతుళ్లను అడ్డుతొలగించుకోవాలని సురేశ్ ప్లాన్ చేశాడు. ప్రణాళికలో భాగంగా అందరితో కలిసి షాపింగ్ కోసం రాజమహేంద్రవరానికి బయల్దేరాడు. ఈ క్రమంలో రావులపాలెంలోని గౌతమి పాత వంతెన వద్దకు తీసుకొచ్చాడు. ఫొటో తీసుకుందామని చెప్పి వారందరినీ నదిలోకి తోసేసి పరారయ్యాడు.
అయితే సుహాసిని, రెండో కుమారై నదిలో పడిపోగా.. కీర్తన మాత్రం వంతెన పక్కగా వేసిన కేబుల్ పైపును అందుకొని వేలాడింది. రక్షించమని కేకలు పెట్టింది. ఎవరి నుంచి స్పందన రాకపోయినా ధైర్యాన్ని కూడగట్టుకుంది. ఒంటిచేత్తో పైపును పట్టుకొని జేబులో ఉన్న ఫోన్ను జాగ్రత్తగా తీసి 100 నంబరుకు కాల్ చేసి తన పరిస్థితిని వివరించింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కీర్తనను రక్షించారు. అయితే చీకటిలో, ఒంటి చేత్తో పైపును పట్టుకుని, ప్రాణభయంలో కూడా ఆ బాలిక చూపిన తెగువ పోలీసుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది.